సిరా న్యూస్ పెంబి:
తాటిగూడలో కుంగిన జిపి భవనం బేస్మెంట్…
+ నిర్మించిన 24 గంటల్లోపే కుంగిపోవడంతో గ్రామస్తుల ఆగ్రహం
+ కరువైన అధికారుల పర్యవేక్షణ
+ కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని గ్రామ సర్పంచ్ తానాజీ స్పష్ఠీకరణ
నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని తాటిగూడ గ్రామంలో రూ. 20 లక్షలతో నిర్మిస్తున్న గ్రామపంచాయతీ నూతన భవనం బేస్మెంట్ కుంగిపోయింది. పనులు చేపట్టి 24 గంటలు గడవకముందే బేస్మెంట్ పూర్తిగా కుంగిపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి కొత్త గ్రామపంచాయతీ భవనం మంజూరవడంతో ప్రభుత్వ స్థలం లేనప్పటికీ కూడా, గ్రామస్తులంతా కలిసి ప్రైవేట్ వ్యక్తి నుండి స్థలం కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. రూ. 6.6 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన భూమిలో ఇలా నాసిరకంగా గ్రామపంచాయతీ భవన పనులు చేపట్టడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. పనులు కొనసాగుతున్న సమయంలో సంబంధిత అధికారులు ఎవరూ కూడా లేకపోవడంతో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు గ్రామపంచాయతీ భవన పనులను సందర్శించి, నాణ్యతతో పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సర్పంచ్ తానాజీ, గ్రామస్తులు రాజేందర్, పరుశురాం, తదితరులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు, కాంట్రాక్టర్ స్పందించకపోతే జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తున్నారు.