సిరా న్యూస్,సికింద్రాబాద్;
మత విద్వేషాలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడే వారు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. మోండా మార్కెట్ లోని కుమ్మరిగూడ లో గల ముత్యాలమ్మ దేవాలయంలో సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు అమ్మవారి విగ్రహాన్ని ద్వంసం చేశారు. విషయం తెలుసుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ సంఘటనా స్థలికి చేరుకొని ఆలయంలోకి వెళ్ళి పరిశీలించారు. పోలీసు అధికారులు, స్థానికులను ఘటన కు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అమ్మవారి విగ్రహాన్ని ద్వంసం చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కోరారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎంతో ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు మత ఘర్షణలకు దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నిన్నటి వరకు బతుకమ్మ, దుర్గామాత నవరాత్రులు ఎంతో ఘనంగా, భక్తి శ్రద్దలతో జరుపుకోవడం జరిగింది, ఇంతలోనే ఈ ఘటన జరగడం బాధాకరం అన్నారు. ఈ ఘటన తో ఒక వర్గం ప్రజలు తమ మనోభావాలను దెబ్బతీసే చర్యగా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు. ఈ ఘటన లో ఇద్దరు ముగ్గురు వరకు బాగస్వాములు అయినట్లుగా స్థానికులు పేర్కొంటున్నారని, వారిలో ఒక్కరు మాత్రమే పోలీసుల అదుపులో ఉన్నారని తెలిపారు. ఈ ఘటనలో ఎంతమంది ఉన్నారో పూర్తిస్థాయి విచారణ జరిపి దోషులు ఎంతటి వారైనా కఠినంగా వ్యవహరించాలని అన్నారు. ఎమ్మెల్యే వెంట మోండా డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అద్యక్షుడు ఆకుల హరికృష్ణ, నాయకులు నాగులు, మహేందర్, మహేష్, సత్యనారాయణ, అమర్ తదితరులు ఉన్నారు.