సిరా న్యూస్,కడప;
కడపజిల్లా అంటేనే వైసీపీ అధినేత సొంత జిల్లా. దాని పేరే వైఎస్సార్ కడప జిల్లాలో అలాంటి కడప జిల్లాలో వైసీపీ ఆపసోపాలు పడుతుంది. సరైన నాయకత్వం జిల్లాలో కొరవడింది. దీంతో అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ కుటుంబానికి ఆ జిల్లా దూరమవుతున్నట్లే కనపడుతుంది. నాయకత్వ లేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అధికారం ఉన్నప్పుడు అందరూ నాయకులే. కానీ రాష్ట్రంలో అధికారం లేనప్పుడు మాత్రం ఎవరూ పార్టీని పట్టించుకోవడం లేదు. పార్టీకి పెద్ద దిక్కు అనేది లేకుండా పోయింది. దీంతో వైసీపీ క్యాడర్ కకావికలమవుతుంది. ఉన్న ద్వితీయ శ్రేణి నేతలు కూడా పార్టీని వీడి వెళ్లిపోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.గత అసెంబ్లీ ఎన్నికల్లోనే కడప జిల్లాలో వైసీపీ దారుణమైన ఫలితాలను చూసింది. 2019 ఎన్నికల్లో పది స్థానాలకు గాను పదింటిని గెలుచుకున్న వైసీపీ 2024 ఎన్నికల్లో మాత్రం మూడు స్థానాాలకే పరిమితమయింది. ఇది చాలదూ వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో వైసీపీ పతనమయిందనడానికి ఉదాహరణ. తర్వాత జడ్.పి. ఛైర్మన్ పదవి పోకుండా ఎలాగోలా కాపాడుకోగలిగారు. అదీ వైఎస్ జగన్ ఇన్ వాల్వ్ అయి వారితో సమావేశమయి కొంత భరోసా ఇవ్వడంతో జడ్పీ చైర్మన్ పదవి కోల్పోలేదు. అన్ని నియోజకవర్గాల్లో బలమైన నేతలున్నారు. ఇప్పుడు సిట్టింగ్ పార్లమెంటు సభ్యుడిగా వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారు. అయినా ఎవరూ పార్టీని పట్టించుకోవడం లేదునియోజకవర్గంలో నేతలు పట్టించుకోక పోవడంతో పార్టీని వదలి ద్వితీయ శ్రేణి నేతలు వదలి వెళ్లిపోతున్నారు. టీడీపీ క్షేత్రస్థాయిలో బలం పుంజుకునే దిశగా అడుగులు వేస్తుంది. జగన్ కూడా బెంగళూరు – తాడేపల్లి మధ్య చక్కర్లు కొడుతుండటంతో ఇక నేతలు కూడా పట్టించుకోవడంలేదు. జమ్మలమడుగు వంటి పట్టున్న నియోజకవర్గంలోనూ పూర్తిగా పార్టీని ఇన్ ఛార్జి సుధీర్ రెడ్డి వదిలేశారు. అయన నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. దీంతో అక్కడ క్యాడర్ కూడా అయోమయంలోనే ఉంది. అక్కడ రామసుబ్బారెడ్డికి పార్టీ బాధ్యతలను అప్పగించాలని వైసీపీ అధినాయకత్వం భావిస్తుంది. అయితే దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదుఇక కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో మున్సిపల్ కౌన్సిలర్లు వైసీపీ నుంచి వెళ్లిపోయారు. టీడీపీ ఖాతాలోకి కమలాపురం మున్సిపాలిటీ దాదాపుగా వెళ్లిపోయింది. ఛైర్మన్ తో పాటు వైసీపీకి చెందిన కౌన్సిలర్టు టీడీపీలో చేరిపోయారు. జగన్ మేనమామ కమలాపురం నియోజకవర్గానికి మొన్నటివరకూ ప్రాతినిధ్యం వహించారు. వైసీపీ బలం ఎనిమిదికి పడిపోవడంతో అక్కడ వైసీపీ వీక్ అయింది. కౌన్సిలర్లు వెళ్లిపోతున్నా అక్కడ పట్టించుకునేందుకు ఎవరూ లేరు. ఏ నేత ప్రయత్నించకపోవడం పార్టీ పరిస్థితికి అద్దం పడుతుంది. ఇలా కడప జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో అదే పరిస్థితి నెలకొంది. మరి జగన్ రంగంలోకి దిగుతారా? లేదా? అన్నది చూడాలి.