సిరా న్యూస్,విజయవాడ;
విపక్షం వైసీపీపై వస్తున్న విమర్శలకు.. కీలక వరదల సమయంలో తమను తాము డిఫెన్స్ చేసుకునేం దుకు.. వైసీపీ తరఫున కేవలం ఇద్దరంటే ఇద్దరు నాయకులు మాత్రమే మాట్లాడుతున్నారు. వారిద్దరూ మాజీ మంత్రులే. ఒకరు పేర్ని నాని, మరొకరు అంబటి రాంబాబు. వీరిద్దరు మినహా మిగిలిన వారు ఎవరూ కూడా మీడియా ముందుకు రావడం లేదు. డిఫెన్స్ కూడా చేసుకోవడం లేదు. ఎవరికి వారు మౌనంగానే ఉండిపోతున్నారు. మరి దీని వెనుక రీజనేంటి? అనేది ఆసక్తిగా మారింది.వాస్తవానికి వైసీపీకి విజయవాడలోనే ఫైర్ బ్రాండ్ నాయకుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు వంటివారు ఉన్నారు. కీలకమైన వరదల సమయంలో వారు మాట్లాడొచ్చు. కానీ, వారిద్దరూ ఎక్కడా కనిపించ డం లేదు. ఇక, మిగిలిన నాయకులు రోజా, కొడాలి నాని.. వంటివారు కూడా మౌనంగానే ఉండిపోతున్నారు. పోనీ. పరిస్థితి ప్రశాంతంగా ఉందా? అంటే.. అదీ లేదు. అధికార పార్టీ నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మరి ఈ సమయంలో వారు ఏం చేస్తున్నారనేది ప్రశ్న.తాజాగా వైసీపీ అంతర్గత సమాచారం ప్రకారం.. మాజీ సీఎం జగన్ అందరికీ ఫ్రీహ్యాండ్ ఇచ్చారని తెలిసింది. అంటే అందరూ మీడియా ముందుకు వచ్చి ప్రస్తుత పరిస్థితిపై వ్యాఖ్యానించాలని.. పార్టీకి ఎదుర వుతున్న ఇబ్బందులు తగ్గించాలని కూడా పేర్కొన్నారట. కానీ, కేవలం అంబటి, నానిలు మాత్రమే మీడియా ముందుకు వస్తున్నారు. మిగిలిన వారు మాత్రం తమపై ఉన్న కేసులు.. లేదా.. నియోజకవర్గాల్లో బలమైన కూటమి కేడర్ కారణం.. వెనక్కి తగ్గుతున్నారని తెలుస్తోంది.అంటే ఒక రకంగా నాయకులు భయపడుతున్నారనేది వాస్తవం. ఇప్పటికే తమపై కేసులు ఉన్న నేప థ్యంలో తాము ఇప్పుడు నోరు తెరిస్తే.. ఏదో ఒక కేసు పెట్టి ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుందని ఒకవైపు ఆలోచనగా ఉంటే.. మరోవైపు నాయకులకు ఏం జరిగినా.. పార్టీ అధిష్టానం సైలెంట్‌గా ఉంటున్న విషయాన్ని కూడా నాయకులు పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తమకెందుకు బురద అంటించుకోవడం అనే ధోరణిలోనే నాయకులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే వైసీపీలో జోష్ కనిపించడం లేదని తెలుస్తోంది.