మూడు డయేరియా కేసులు నమోదు

సందర్శించిన జిల్లా వైద్యాధికారులు వైద్య బృందం మండల స్థాయి అధికారులు…

సిరా న్యూస్,రుద్రవరం;
మండల కేంద్రమైన రుద్రవరంలోని ఆయా కాలనీలలో 3 డయేరియా కేసులు నమోదు కావడంతో జిల్లా వైద్యాధికారులు ఆర్డబ్ల్యూఎస్ జిల్లా అధికారులు వైద్య బృందం పంచాయతీ సిబ్బంది సోమవారము ఆయా కాలనీలను సందర్శించారు. రుద్రవరంలోని ఎస్సీ కాలనీ చంద్రుని గుడి వద్ద పలు కాలనీలను సందర్శించిన అధికారులు త్రాగునీటి సరఫరాను పారిశుధ్యం తదితర వాటిని పరిశీలించి త్రాగునీరు పారిశుధ్యం పై చర్యలు తీసుకోవాలని పంచాయతీ ఈఓకు సూచించారు. ఎస్సీ కాలనీ చంద్రుని గుడి వద్ద కాలనీలో డయేరియా బారిన పడిన వారి ఇళ్ల వద్దకు వెళ్లి వారి ఆరోగ్యం పై కుటుంబ సభ్యులను ఆరా తీశారు. ఈ సందర్భంగా డిఎంహెచ్వో వెంకటరమణ ఆర్డబ్ల్యూఎస్ ఈ ఈ మనోహర్ మాట్లాడుతూ గ్రామంలోని పలు కాలనీలో శనివారం ఒకటి ఆదివారం రెండు డయేరియా కేసులు నమోదు కావడంతో కాలనీలలో సందర్శించి డయేరియా బారిన పడిన వారి ఇళ్ల వద్దకు వెళ్లి వారి ఆరోగ్యం పై కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నామన్నారు. త్రాగునీటి వలన డయేరియా వచ్చినట్లు అంచనాకు రాలేకపోతున్నామని, త్రాగునీరు శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం పంపడం జరిగిందని ఇంకా నిర్ధారణ బయటపడలేదన్నారు. త్రాగు నీటి వలన డయేరియా వచ్చినట్లయితే కేసులు అధిక సంఖ్యలో నమోదయ్యే అవకాశం ఉండేదన్నారు. త్రాగునీటి వలన డయేరియా వచ్చి ఉండదని ఫుడ్ పాయిజన్ లేక వేరే కారణాల వలన వచ్చి ఉండవచ్చునని వారు తెలిపారు. ఏది ఏమైనా గ్రామంలో మూడు డయేరియా కేసులు నమోదు కావడంతో ముందస్తుగా గ్రౌండ్ లెవెల్ రిపోర్టు తీసుకోవాలని వైద్య అధికారులు సిబ్బందికి సూచించామన్నారు. కాలనీలలో వైద్యాధికారులు వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి కాలనీవాసులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు మాత్రలు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. దేవుడు దయవలన కేసుల సంఖ్య పెరగలేదని కేసులు పెరగకుండా ఉండేందుకు వైద్య అధికారులను అప్రమత్తం చేశామని ప్రజల ఆరోగ్యం ప్రదానం కాబట్టి గ్రామంలో వైద్య అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రస్తుత పరిస్థితులలో అత్యవసరమైతే ఎమర్జెన్సీ సిబ్బందిని ఏర్పాటు చేస్తామని తప్పని పరిస్థితులలో ఆళ్లగడ్డ నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రులకు పేషెంట్లను తరలించేందుకు అదనంగా మరో 108 వాహనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని సిబ్బందిని పెంచే అవకాశం ఉంటుందని వారు తెలిపారు. గ్రామస్తులు కాంచన నీటిని త్రాగాలని ఈ విషయంపై ప్రజలకు తెలిసేలా గ్రామంలో దండోరా వేయించాలని సర్పంచ్ పంచాయతీ ఈవో కు సూచించారు. డయేరియా కేసు నమోదైన ఎస్సీ కాలనీలో ఎంపీడీవో భాగ్యలక్ష్మి ఆర్డబ్ల్యూఎస్ ఈఈ మనోహర్ డిఇ రవికుమార్ ఏఈ సుబ్రహ్మణ్యం తో పాటు పలువురు అధికారులు సందర్శించి డయేరియా కేసులపై ఆరా తీశారు. కాలనీలో త్రాగునీరు పారిశుధ్యం పై చర్యలు తీసుకోవాలని పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. సర్పంచ్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో వాటర్ ట్యాంకు ద్వారా కాలనీవాసులకు త్రాగునీరు సరఫరా చేయించారు. మండల పరిషత్ కార్యాలయం ఆవరణంలో ఉన్న త్రాగునీటి సరఫరా మోటార్ వద్ద ఆర్డబ్ల్యూఎస్ అధికారులు లో లెవెల్ క్లోరినేషన్ చేశారు. వారి వెంట ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం నూడల్ అధికారి జగదీష్ చంద్రారెడ్డి, వైద్యాధికారులు శ్రావణి, హుసేని, పంచాయతీ ఈవో సుబ్బారావు, వైద్య సిబ్బంది పంచాయతీ సిబ్బంది ఆశా కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *