కారుతో సహా 23ఎర్రచందనం దుంగలు స్వాధీనం
సిరా న్యూస్;
రాజంపేట అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేసి, కారుతో సహా 23ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్సు ఇన్చార్జి, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ.శ్రీనివాస్ అధ్వర్యంలో డీఎస్పీ జీ. బాలిరెడ్డి సూచనల మేరకు కడప జిల్లా టాస్క్ ఫోర్సు సబ్ కంట్రోల్ ఆర్ఐ చిరంజీవులకు చెందిన ఆర్ఎస్ఐ పీ. నరేష్ బృందం అన్నమయ్య జిల్లా రాజంపేట పరిధిలోని అటవీ ప్రాంతంలో అటవీ శాఖా సిబ్బందితో కలసి కూంబింగ్ నిర్వహించారు. ఎస్ఆర్ పాలెం వద్ద శుక్రవారం కొంత మంది వ్యక్తులు కారులో ఎర్రచందనం దుంగలు లోడ్ చేస్తూ కనిపించారు. టాస్క్ ఫోర్సు పోలీసులు వారిని హెచ్చరించి చుట్టుముట్టగా ముగ్గురు వ్యక్తులు పట్టుబడగా మిగిలిన వారు పారిపోయారు. వారిలో ఇద్దరికి కడప జిల్లాకు చెందిన వారుగాను, ఒకరిని తమిళనాడు రాణిపేట జిల్లాకు చెందిన వాడిగా గుర్తించారు. పారిపోయిన వారి కోసం గాలిస్తున్నారు. పట్టుబడిన వారిని, దుంగలు, కారుతో పాటు తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్ కు తరలించారు. విచారణలో ఈ ముగ్గురు స్మగ్లర్లపై గతంలోనూ కేసులు ఉన్నట్లు గుర్తించారు. టాస్క్ ఫోర్సు సీఐ సురేష్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.