సిరా న్యూస్,అదిలాబాద్;
ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులి టెన్షన్ పెడుతోంది. బోథ్ మండలం వజ్జర్ అటవీ ప్రాంతంలో తిరుగుతున్న పెద్దపులి స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంది. బుధవారం సాయంత్రం వేళల్లో బోథ్ మండలంలోని చింతగూడ, బాబేరతండా సమీపంలో పులి సంచరించింది.అయితే ఓ రైతు చూస్తుండగానే ఎద్దుపై పెద్దపులి దాడి చేసి హతమార్చింది. స్థానిక రైతు సమాచారం మేరకు.. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండంలోని బాబేరతండా గ్రామానికి చెందిన రైతు జాదవ్ దిలీప్ రేండ్లపండ్లి గ్రామంలో ఉన్న తన పొలంలో ఎడ్లను మేపుతున్నాడు. ఆయన చూస్తుండగానే ఒక్కసారిగా పెద్దపులి ఎద్దుపై దాడి చేసింది. దీంతో తీవ్ర భయాందోలనకు గురైన రైతు హుటాహుటిన పరిగెత్తుకుంటూ గ్రామంలోకి వచ్చి అందరికీ విషయం చెప్పాడు.దీంతో గ్రామస్తులు పెద్దఎత్తున తరలివచ్చి ఆ ప్రాంతంలో అలజడి సృష్టించడంతో పులి వెనుదిరిగింది. పెద్దపులి వచ్చిందన్న సమాచారం తెలియడంతో చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ పులి మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి భీంపూర్, తలమడుగు, బార్డర్ మీదుగా మహారాష్ట్రలోని కిన్వట్ వెనుకవైపు నుంచి బోథ్ మండలంలోని వజ్జర్ అటవీ ప్రాంతంలోకి సంచరించినట్లు చెబుతున్నారు.