సిరా న్యూస్;
ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం అక్టోబరు 5వ తేదిన ఉపాధ్యాయులు విద్యార్థుల సమక్షంలో విద్యాలయాలలో వేడుకగా నిర్వహిస్తారు. ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని 1994వ సంవత్సరం నుండి అక్టోబరు 5వ తేదిన జరుపుకుంటున్నారు.అంతర్జాతీయ విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ (యునెస్కో) 1966 సెప్టెంబర్ 21 నుండి 15 రోజుల పాటు పారిస్‌లో ఉపాధ్యాయుల పరిస్థితిపై ప్రత్యేకంగా అంతర్జాతీయ సదస్సు నిర్వహించింది. అనేక దేశాలు, ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థ, వివిధ ప్రభుత్వేతర సంస్థల ప్రతినిధులు పాల్గొన్న ఆ సదస్సు ఉపాధ్యాయుల హోదా పెంచడానికి వారి హక్కులు, బాధ్యతలకు సంబంధించి కొన్ని నిర్దిష్ట సిఫారసులతో సమగ్రమైన పత్రాన్ని ఆమోదించింది. ‘స్టేటస్ ఆఫ్ ది టీచర్స్’ పత్రాన్ని ఆమోదించిన అక్టోబర్ 5న ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించి, సదరు సిఫార్సుల అమలును ప్రతియేటా సమీక్షించాలని నిర్ణయించింది.
ఈ రోజున ఒక విద్యా సంస్థలో పనిచేసే ఉపాధ్యాయులు లేక పలు విద్యాసంస్థలలో పనిచేసే ఉపాధ్యాయులు ఒకచోట సమావేశమై తమ భవిష్యత్ తరాలకు కావలసిన ఏర్పరుచుకోవాల్సిన పలు అంశాలపై చర్చిస్తారు. ఇందుకోసం తమ అందరి మద్దతుతో హామీలను పొందెందుకు సన్నద్ధమవుతారు. ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవమునే కొన్ని దేశాలలో జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు.