సిరా న్యూస్;
మనిషి రక్తం అమూల్యమైనది. ఎందుకంటే రక్తానికి ప్రత్యామ్నాయం లేదు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం దొరక్క దేశంలో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినట్లే. ఈ రక్తంలో గ్రూపులు ఉన్నాయి గానీ.. రక్తానికి ప్రాంతాలు లేవు, కులమత భేదాలు లేవు. సమైక్య భావనను ఈ రక్తం పూర్తిస్థాయిలో చూపిస్తుంది. ఎవరెక్కడివారైనా.. గ్రూపు సరిపోతే చాలు, భేషుగ్గా ఆ రక్తం ఎక్కించుకోవచ్చు.
మన దేశంలో నాలుగు కోట్ల యూనిట్ల రక్తం అవసరం కాగా.. కేవలం 40 లక్షల యూనిట్లే అందుబాటులో ఉంది. మిగతా దేశాలతో చూస్తే మన దేశంలో స్వచ్ఛందంగా రక్తం దానం చేసేవారి సంఖ్య చాలా తక్కువ. ఇప్పుడున్న పరిస్థితిలో దేశంలో డిమాండుకు తగినంత రక్తం అందుబాటులో లేదు. ఇక మన రాష్ట్రం విషయానికొస్తే… రాష్ట్ర జనాభాలో ఒక్క శాతం మంది సంవత్సరానికి ఒకసారి రక్తం దానం చేసినా రక్తం కొరత తీరుతందంటున్నారు వైద్యులు.
మన దేశంలో జాతీయ స్వచ్ఛంద రక్త దాన దినోత్సవం 1975 నుంచి ప్రారంభమైంది. అయితే రక్తదానంపై ప్రజలకు సరైన అవగాహన కల్పిస్తే… ఆశించిన స్థాయిలో దాతలు ముందుకొస్తారని వైద్యులు అంటున్నారు. జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం ను ప్రతి సంవత్సరం అక్టోబరు 1 న జరుపుకుంటారు. 1975లో స్వరూప కృష్ణన్, డాక్టర్ జె.జి జోలీల చొరవతో ఈ పద్ధతి ప్రారంభమయింది. ఈ రోజున ప్రత్యేకంగా రక్తదానంపై కొన్ని కార్యక్రమాలను నిర్వహించి ప్రజలకు రక్తదానం యొక్క ఆవశ్యకత గురించి తెలియచేస్తూ వారు రక్తదానం చేసేలా వారిలో చైతన్యాన్ని కలిగిస్తారు.