వలస ఎమ్మెల్యేలల్లో వణుకు…

సిరా న్యూస్,వరంగల్;
హైకోర్టు ఆదేశాలతో తెలంగాణలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. పార్టీ ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలనే హైకోర్టు ఆదేశాలు…. వలస ఎమ్మెల్యేల్లో గుబులు రేకెత్తిస్తున్నాయి. గత ప్రభుత్వంలో కాలయాపన జరిగినట్లు.. ఇప్పుడు కూడా పదవీకాలం పూర్తయ్యేవరకు గడిపేయొచ్చని భావించిన ఎమ్మెల్యేలకు హైకోర్టు తీర్పుతో ఎదురుదెబ్బ తగిలినట్లైంది. వేటు కత్తి వేలాడుతుండటం… చట్ట ప్రకారం స్పీకర్ నిర్ణయం తీసుకుంటే… మూడు అసెంబ్లీ స్థానాలకు ఆరు నెలల్లోనే ఉప ఎన్నిక అనివార్యమయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఐతే స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది సస్పెన్స్‌గా మారగా, హైకోర్టు తీర్పుతో పర్యావసానాలపై మిగిలిన ఏడుగురు వలస ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నట్లు చెబుతున్నారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకొని ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేయాలని చూసిన కాంగ్రెస్ పార్టీ లక్ష్యం నెరవేరలేదు. ఇప్పుడు తాజాగా హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ అధికార పార్టీకి ఝలక్ ఇచ్చినట్లైందంటున్నారు. బీఆర్ఎస్ నుంచి మొత్తం 26 మందిని కాంగ్రెస్‌లోకి చేర్చుకోవాలని ప్రభుత్వ పెద్దలు ప్లాన్ చేయగా, ప్రస్తుతానికి 10 మంది మాత్రమే హస్తం గూటికి చేరారు. ఐతే వీరిలో ముగ్గురిపై తక్షణం చర్యలు తీసుకోవాలని గతంలోనే స్పీకర్‌కు, ఆ తర్వాత హైకోర్టుకు నివేదించింది బీఆర్ఎస్. అనర్హత వేటు వేయడంలో తాత్సారం చేస్తున్న స్పీకర్‌ తక్షణం నిర్ణయం తీసుకోవాలని ఆదేశించాల్సిందిగా కోరుతూ హైకోర్టుకు వెళ్లింది బీఆర్ఎస్.ఆ పార్టీ అనుకున్నట్లే అనర్హత వేటుపై తీసుకోబోయే చర్యలకు సంబంధించి షెడ్యూల్ రూపొందించి నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ అసెంబ్లీ కార్యదర్శికి కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో కాంగ్రెస్ పెద్దలు కంగుతిన్నారు. పార్టీ మారిన ఈ ముగ్గురు ఎమ్మెల్యేలను ఎలా కాపాడుకోవాలనే వ్యూహ రచన చేస్తున్నారు. మరోవైపు కారు దిగిన మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలకు ఏ రకమైన భరోసా ఇవ్వాలన్నదానిపై అధికార పార్టీ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారట.ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి 10 మంది కాంగ్రెస్‌లోకి జంప్ చేయగా, వీరిలో ముగ్గురిపై ఏదో ఒక నిర్ణయం వెల్లడించాలని స్పీకర్‌ను ఆదేశించింది హైకోర్టు. దీంతో ఈ ముగ్గురితోపాటు మిగిలిన ఏడుగురు టెన్షన్ పడుతున్నారని అంటున్నారు. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్లమెంట్ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ లో చేరారు. కడియం శ్రీహరి కుమార్తెకు వరంగల్ పార్లమెంట్ టికెట్ ఇప్పించుకోగా, దానం నాగేందర్ ఏకంగా సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి దొరికిపోయారు. అటు తెల్లం వెంకట్రావు సైతం లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహించారు. దీంతో ఈ ముగ్గురిని టార్గెట్ చేసింది గులాబీదళం. వీరిపై కోర్టును ఆశ్రయించి.. అనర్హత వేటు వేయించేందుకు వాదనలు విన్పించింది బీఆర్ఎస్. దీంతో నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలనే రకంగా డైరెక్షన్ ఇచ్చింది హైకోర్టు.ఇంకా డివిజన్ బెంచ్ కు వెళ్లేందుకు … సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సైతం ఎమ్మెల్యేలకు అవకాశం ఉన్నా… అది పెద్దగా ఉపయోగ ఉండకపోవచ్చనే వాదనే విన్పిస్తోంది. గతంలో మహారాష్ట్ర ఎమ్మెల్యేల విషయంలో ఇదే రకంగా మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు సైతం డైరెక్షన్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు న్యాయనిపుణులు. దీంతో ఈ ముగ్గురిపై వేటు ఖాయమని.. ఉప ఎన్నికలు తప్పవనే చర్చ జోరుగా సాగుతోంది. అదే జరిగితే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు చెరో స్థానాన్ని గెలుచుకునే అవకాశాలున్నాయనే ఊహాగానాలు సాగుతున్నాయి.ఇదిలా ఉంటే మిగిలిన ఏడుగురిపై మాత్రం బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఎవరికి వారే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఎలాంటి ఆధారాలను బీఆర్ఎస్ కు చిక్కకుండా జాగ్రత్త పడుతున్నారు ఫిరాయింపు ఎమ్మెల్యేలు… బహిరంగంగా ఎక్కడా కాంగ్రెస్ కు మద్దతు పలికినట్లు కనపడకుండా… ప్రభుత్వాన్ని భుజాన మోస్తున్నారు. ఈ ముగ్గురిలో ఏ ఒక్కరిపై వేటు పడినా, మిగిలిన వారందరూ అదే శిక్షను ఎదుర్కోవాల్సి వుంటుంది. ఈ పరిస్థితుల్లో ఎవరు బలైపోతారోనని పార్టీ మారిన ఎమ్మెల్యేలు భయపడుతున్నట్లు చెబుతున్నారు.వేటు నుంచి తప్పించుకోవాలంటే ముందుగా రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లడం ఒక్కటే ఎమ్మెల్యేలకు ప్రత్యామ్నాయంగా చెబుతున్నారు. ఐతే పార్టీ మారిన 10 మందిలో ఒకరిద్దరికి తప్ప మిగిలిన నేతలు అందరికీ నియోజకవర్గంలో పరిస్థితులు అంత సానుకూలంగా లేవంటున్నారు. దాదాపు అందరూ కాంగ్రెస్ క్యాడర్ నుంచి సహాయ నిరాకరణ ఎదుర్కొంటుండటం వల్ల తమ పరిస్థితి ముందు నుయ్యి.. వెనక గొయ్యి అన్నట్లు తయారైందని నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యేలు. జంపింగ్ ఎమ్మెల్యేల్లో దాదాపు అందరూ వ్యతిరేకత ఎదుర్కొంటుండం వల్ల ఉప ఎన్నికలను ఎదుర్కొనే విషయంపై తర్జనభర్జన సాగుతోంది.గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డికి ఇన్‌చార్జి సరితా తిరుపతయ్యతోను, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డితోనూ విభేదాలు కంటిన్యూ అవుతున్నాయి. అదే విధంగా చేవెళ్లలో ఎమ్మెల్యే యాదయ్యకు, కాంగ్రెస్ నేత భీం భరత్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఇక మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డికి పొసగడం లేదు. దీనికితోడు ఇప్పుడు అనర్హత కత్తి వేలాడుతుండటం వల్ల… ఈ క్లిష్ట పరిస్థితి నుంచి ఎలా బయటపడాలనేదే జంపింగ్ ఎమ్మెల్యేలకు పెద్ద టాస్క్‌గా మారిందంటున్నారు.
=======================

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *