ఉప్పల్.. తిప్పల్..తీరేదెన్నడూ……..

సిరా న్యూస్,హైదరాబాద్;
ఉప్పల్ ఫ్లై ఓవర్ నిర్మాణ సంస్థ చేసిన తప్పిదాలకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.దుమ్ము, గుంతలతో నిండిన రోడ్లు, తవ్విన రహదారులతో స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.రెండేళ్లలో పూర్తి కావాల్సిన ఈ ఫ్లైఓవర్ పనులు …ఐదేళ్లుగా నత్తనడకన నడుస్తున్నందున నగరం నుంచి వరంగల్ కు వెళ్లే వాహనాదారులు ఉప్పల్ నుంచి నారపల్లి వెళ్లే దారిలో నరకయాతన అనుభవిస్తున్నారు.ఆరున్నర కిలోమీటర్ల దూరానికి గంటకు పైగా ప్రయాణించాల్సి వస్తుందని వాపోతున్నారు.
నత్తనడకన పనులు..
ఉప్పల్ నుంచి నారపల్లి వరకు 6.2 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ ను జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ (ఎన్ హెచ్ ఏ ఐ) 2018లో చేపట్టింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పనులు ప్రారంభించారు.పీవీఎన్ ఆర్ ఎక్స్ ప్రెస్ తర్వాత రాష్ట్రంలో రెండవ పొడవైన ప్లై ఓవర్ గా ఉప్పల్ ప్లై ఓవర్ నిలిచింది.కాగా మాజీ పార్లమెంట్ సభ్యులు టి.సుబ్బిరామిరెడ్డికి సంబంధించిన గాయత్రి ప్రాజెక్ట్స్ కంపెనీ రూ.626.76 కోట్లకు ఫ్లై ఓవర్ నిర్మాణ టెండర్ దక్కించుకుంది. 18 నెలల్లో అనగా 2020 వరకు పనులను పూర్తి చేయాల్సి ఉంది. మొత్తం 148 పిల్లర్లపై 45 మీటర్ల వెడల్పుతో ఆరు లైన్లలో ప్లై ఓవర్ నిర్మించాల్సి ఉంది. ఎలివేటెడ్ కారిడార్ కు ఇరువైపులా 150 అడుగుల విస్తీర్ణంలో సర్వీసు రోడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల నుంచి వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాగించేందుకు, సర్వీస్ రోడ్లను విస్తరించడం ద్వారా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేయాలని భావించారు. 2020 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.గత ఐదేళ్లలో ఫిల్లర్లు మాత్రమే పూర్తి చేశారు. ఫ్రీకాస్ట్ పద్ధతిలో పిల్లర్లపై స్లాబ్ ఏర్పాటు పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. కాగా ,ఫిల్లర్ల ఏర్పాటు కోసం ఎక్కడిక్కడ తవ్వి పోయడంతో రోడ్డంతా గుంతల మయంగా మారింది. పనులు ప్రారంభం కాకముందే రోడ్డు పరిస్థితి బాగుండేదని స్థానికులు వాపోతున్నారు.హైదరాబాద్ కు తూర్పు వైపున ఉప్పల్– వరంగల్ మార్గం చాలా కీలకం. యాదాద్రి, వరంగల్ వైపు నుంచి వచ్చే, వెళ్లే ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు ఈ రూట్‌లోనే ప్రయాణించాలి. రోజూ 30 నుంచి 40 వేల వాహనాలు ఈ మార్గంలో ప్రయాణాలు సాగిస్తాయి. ఇంత కీలకమైన ఈ రూట్‌లో ట్రాఫిక్ లేకుండా చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ పనులు మరింత ట్రాఫిక్ చిక్కులు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఉప్పల్ క్రాస్ రోడ్డు, నల్ల చెరువు కట్ట, కట్ట మైసమ్మ టెంపుల్ ప్రాంతాల్లో సమస్య ఎక్కువగా ఉంటుంది. ఉప్పల్ నుంచి బోడుప్పల్ కు 2 నుంచి 3 నిమిషాల్లో చేరాల్సి ఉండగా.. ప్రస్తుతం 15 నుంచి 20 నిమిషాలు పడుతుంది. పనుల కారణంగా మేడిపల్లి రింగ్ రోడ్డు ప్రాంతంలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి.అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఫీర్జాదిగూడ మేయర్‌ వెంకట్‌ రెడ్డి లు సచివాలయంలో నాటి సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఉప్పల్‌- నారపల్లి రోడ్డు పరిస్థితిని వివరిస్తూ సీఎంకు వినతి పత్రం అందజేశారు. వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్‌ ఉప్పల్‌ నుంచి నారపల్లి సీపీఆర్‌ఐ వరకు ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులతో నిమిత్తం లేకుండా బీటీ రోడ్డు వేయాలని అప్పటి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని ఆదేశించారు. రోడ్డు వేయాలన్న మాజీ సీఎం ఆదేశాలు కూడా అమలుకు నోచుకోక పోయినందున స్థానికులు గుంతల రోడ్డు తో నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు.ఫ్లై ఓవర్ నిర్మాణ సంస్థ దివాలా తీసింది. బ్యాంకుల నుంచి రూ.6 వేల కోట్ల రుణం తీసుకొని చెల్లించడంలో జాప్యం చేస్తుంది.దివాలా పిటిషన్ దాఖలు చేసింది. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన నిర్మాణ సంస్థ ఫ్లైఓవర్ ను పూర్తి చేస్తుందంటే నమ్మేలా లేదు. గత రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమని ఆరోపించింది. కేంద్ర ప్రభుత్వం మాత్రం స్థల సేకరణ, ఇతర మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర సర్కార్ సహకరించడం లేదంటుంది. నేను సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సమాచారాన్ని బట్టి ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు ఇప్పటి వరకు 42.50 శాతం పూర్తి అయ్యాయి. మిగతా పనులు ఆగస్టు , 2024 వరకు పూర్తి చేస్తామని చెబుతున్నారు. అయితే ఈ 8 నెలల్లో పనులు పూర్తి అయ్యేలా కనిపించడం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *