చోరీ జరిగిన తీరు వివరించిన అర్చకులు
పోలీసుల దర్యాప్తు వేగవంతం : వెంకట్రామ్
పునరావృతం కాకుండా చర్యలు
సిరా న్యూస్,అవనిగడ్డ;
టేకుపల్లి రామేశ్వర స్వామి దేవస్థానంలో స్వామి వారి కవచాలను చోరీ చేసిన దొంగలపై తగిన చర్యలు చేపడతామని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తనయుడు, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. మంగళవారం మోపిదేవి మండలం టేకుపల్లి రామేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి కవచాలు చోరీ జరిగిన ఘటన తెలుసుకుని వెంటనే దేవస్థానం వద్దకు వెళ్లి పరిశీలించారు. వేద పండితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. చోరీ జరిగిన తీరు సీసీ కెమెరా పుటేజీల్లో పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేవస్థానాల్లో చోరీలు క్షమించరాని నేరం అన్నారు. ఆలయాలు, దేవస్థానాల్లో ఇలాంటి చోరీలు పునరావృతం కాకుండా దొంగలపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే పోలీసులు సీసీ పుటేజ్ ఆధారంగా ఆధారాలు సేకరిస్తున్నారని, క్లూస్ టీమ్ కూడా వచ్చి ఆధారాలు సేకరిస్తారని, పోలీసుల సహకారంతో రామేశ్వర స్వామి కవచాలు సాధ్యమైనంత త్వరగా రికవరీ చేసి స్వామి వారికి అలంకరించేలా చర్యలు తీసుకుంటామని వెంకట్రామ్ అన్నారు. తద్వారా ఆలయాల్లో చోరీ చేయాలనే ఆలోచన ఇంకెవరికి రాకుండా పోలీసుల చర్యలు ఉంటాయన్నారు.