సిరా న్యూస్,గుంటూరు;
వైసీపీ నేతలకు కష్టాలు వెంటాడుతున్నాయా? ఈ జాబితా మరింత పెరిగే అవకాశముందా? తాజాగా మాజీ మంత్రి విడుదల రజనీ కూడా అందులో చేరిపోయారా? రేపో మాపో రజనీ అరెస్ట్ తప్పదా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.గడిచిన ఐదేళ్ల కాలం వైసీపీ స్వర్ణయుగం. ముఖ్యంగా నేతలకు కూడా. ఎందుకంటే బెదిరింపులు, దందాలకు పాల్పడినట్టు తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఏపీలో ప్రభుత్వం మారడంతో బాధితులు ఒకొక్కరుగా బయటకు వస్తున్నారు. ఇప్పుడు మాజీ మంత్రి విడుదల రజనీ వంతైంది. ఆమె పేరిట బంధువులు వసూళ్ల దందాపై విచారణకు ఆదేశించారు హోంమంత్రి అనిత.పల్నాడు జిల్లా పేరు చెప్పగానే ముందుగా గుర్తు కొచ్చేది స్టోన్ క్రషర్ బిజినెస్. అక్కడ ఆ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది. దీన్ని గమనించిన కొందరు వైసీపీ నేతలు దందాకు దిగారు. వ్యాపారుల నుంచి డబ్బులు వసూళ్లకు ప్లాన్ చేశారు. మాజీ మంత్రి చిలకలూరిపేట నియోజకవర్గంలో ఆమె బంధువుల ఆగడాలకు అంతులేకుండా పోయింది. పీఏ ద్వారా నిధుల వసూళ్లకు తెరలేపారు.డబ్బులు ఇవ్వకుంటే వ్యాపారం జరగదంటూ బెదిరింపులకు దిగారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని అర్థం చేసుకోలేకపోయారు. ఈ వ్యవహారంపై బాధితుల నుంచి ఫిర్యాదులు వెళ్లాయి. పరిస్థితి గమనించిన మంత్రి అనిత.. వసూళ్ల వ్యవహారంపై నిగ్గు తేల్చాలంటూ పల్నాడు ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు.చిలకలూరిపేట నియోజకవర్గంలోని జగనన్న కాలనీల పేరిట గతంలో మాజీ మంత్రి అనుచరలు డబ్బులు వసూలు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విడుదల వర్గీయులు, రైతుల వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేశారు.వివిధ వర్గాలకు చెందినవారి నుంచి డబ్బులు వసూలు చేసినట్టు మాజీ మంత్రి పీఏతోపాటు రజనీ మరిది గోపీనాథ్ పై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇప్పటికే ఆమె పీఏ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై మాజీ మంత్రి ఎక్కడా నోరు ఎత్తిన సందర్భం రాలేదు. విచారణ జరిగే సమయంలో వారంతా బయటకు వస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.