సిరా న్యూస్,చెన్నై;
తమిళ అగ్ర హీరో విజయ్ తమిళనాడు రాజకీయాలలో ట్రెండ్ సెట్టర్ గా మారారు. ఆయన ఇటీవల తమిళిగ వెట్రి కళగం(టీవీఏ) పేరుతో ఒక పార్టీని ఏర్పాటు చేశారు.. దానికి సంబంధించి ఆదివారం మహానాడు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు
: ఈ కార్యక్రమాన్ని నభూతో న భవిష్యత్ అనే స్థాయిలో టీవీఏ పార్టీ నేతలు నిర్వహిస్తున్నారు. మహానాడు ప్రారంభానికి ముందు టీవీఏ అధినేత విజయ్ నూట ఒక అడుగుల స్తంభానికి పార్టీ జెండా ను ఆవిష్కరించారు. మహా నాడు ప్రాంగణంలో మహనీయుల అనేకచోట్ల కటౌట్లు ఏర్పాటు చేశారు. ఇందులో తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఇద్దరు మహిళ స్వాతంత్ర్య సమరయోధులకు స్థానాన్ని కల్పించారు. ఈ కార్యక్రమానికి దాదాపు రెండు లక్షల మంది దాకా టీవీ కే కార్యకర్తలు హాజరయ్యారు. ఇందులో విజయ్ అభిమానులు కూడా ఉన్నారు. దాదాపు 170 అడుగుల పొడవు, 65 అడుగుల వెడల్పుతో భారీ వేదిక నిర్మించారు. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా స్థలాన్ని ఏర్పాటు చేశారు. కార్యకర్తలు కూర్చోవడానికి 55 వేల కుర్చీలను ఏర్పాటు చేశారు. మహానాడు ప్రాంగణంలో 60 అడుగుల ఎత్తులో కామరాజర్, బిఆర్ అంబేద్కర్, పెరియార్ కట్ అవుట్ లు ఏర్పాటు చేశారు. వీరితోపాటు తమిళనాడు రాష్ట్రానికి చెందిన వీర మహిళ స్వాతంత్ర్య సమరయోధురాళ్లు వీర తంగై వేలు నాచ్చియార్, అంజలై అమ్మాళ్ కటౌట్లు కూడా ఏర్పాటు చేశారు. మీరు మాత్రమే కాకుండా చేర, చోళ, పాండ్య రాజుల కటౌట్లు కూడా నిర్మించారు.. నూట ఒక అడుగుల ఎత్తైన దిమ్మె పై పార్టీ జెండాను విజయ ఆవిష్కరించారు. విజయ్ ఎగరవేసిన జెండా 20 అడుగుల వెడల్పు, 3 అడుగుల పొడవు ఉంది. భారీగా కార్యకర్తలు వచ్చిన నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 700 సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు వచ్చిన నేపథ్యంలో వారి కోసం 300 మొబైల్ టాయిలెట్లు అప్పటికప్పుడు ఏర్పాటు చేశారు.విల్లుపురంలోని విక్రవాండీలో విజయ్ తన పార్టీకి సంబంధించి మహానాడు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తన మనోగతాన్ని, పార్టీ ఉద్దేశాలను విజయ్ వెల్లడించారు.” ఎన్నో సంవత్సరాలుగా పార్టీ పెట్టాలి అనుకుంటున్నాను. చివరికి ఇన్నాళ్లకు నిజమైంది. ఇకపై సినిమాల్లో నటించను. పూర్తిగా తమిళ ప్రజల సేవ కోసమే అంకితం అవుతాను. సామాజిక న్యాయం, తమిళనాడు అభివృద్ధి, తమిళ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే ఈ పార్టీ పనిచేస్తుంది. గతంలో పరిపాలించిన పార్టీలు తమ కుటుంబం కోసమే పని చేశాయి. ప్రజల సమస్యలను గాలికి వదిలేసాయి. ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. అవినీతిని ప్రోత్సహిస్తున్నాయి. అక్రమాలను కొనసాగిస్తున్నాయి. ఇకపై వీటికి స్థానం లేదు. వినూత్నమైన పరిపాలనను తమిళ ప్రజలు చూస్తారని.. అది నేను వారికి అందిస్తానని” విజయ్ ప్రకటించారు.. పార్టీ మహానాడు వేదికగా విజయ్ చేసిన ప్రసంగం అందర్నీ ఆకట్టుకుంది. బిజెపి, డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలను ఆయన నేరుగా విమర్శించకపోయినప్పటికీ.. పరోక్షంగా ఆరోపణలు చేశారు. విజయ్ మాట్లాడుతున్నంత సేపు మహానాడు వేదిక అభిమానుల ఈలలు, గోలలతో హోరెత్తిపోయింది. కార్యకర్తలు విజయ్ చిత్రపటాలను చేతుల్లో పట్టుకుని అటు ఇటు ఊపుతూ కనిపించారు. దీంతో విజయ్ రెట్టించిన ఉత్సాహంతో ప్రసంగించడం మొదలుపెట్టారు. అయితే ఆయన తమిళ కవులు రచించిన కావ్యాలను పలు సందర్భాల్లో ప్రస్తావించి.. కార్యకర్తల్లో, అభిమానుల్లో భాషాభిమానాన్ని రేకెత్తించే ప్రయత్నం చేశారు.