సిరా న్యూస్, విశాఖపట్నం:
సృజనాత్మకతను పెంపొందించుకోవాలి…
విద్యార్థులు చిన్నతనం నుంచే తమలో సృజనాత్మకతను పెంపొందించుకోవాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ విశ్వనాథన్ అన్నారు. శుక్రవారం వేపగుంట మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గణిత శాస్త్రవేత్త రామానుజన్ జయంతి సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సందర్భంగా విద్యార్థులు చేపట్టిన పలు వైజ్ఞానిక ప్రదర్శనలను ఆయన ఆసక్తిగా తిలకించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ప్రతిరోజు తమ నైపుణ్యాలను పెంపొందించే దిశగా కృషి చేయాలని సూచించారు. అనంతరం ఆయన ఇతర అధికారులతో కలిసి ఎకో వైజాగ్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పద్మావతి, ఇతర ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.