సిరా న్యూస్,న్యూఢిల్లీ;
సహారా ఎడారిలో నీటిమడుగులు ఏర్పడ్డాయి. ఆ ప్రాంతంలో ప్రస్తుతం విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో సందడి చేస్తున్నాయి. సహారా ఎడారి మొరాకో దేశంలో విస్తరించి ఉంది. ప్రస్తుతం ఈ ఎడారిలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈత చెట్లు, నీటిమడుగుల మధ్య నీటిమడుగులు ఏర్పడ్డాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియా లో సందడి చేస్తున్నాయి. ఆగ్నేయ మొరాకో దేశంలో విస్తరించిన సహారా ఎడారిలో వర్షాలు కురుస్తాయి. అయితే గత సెప్టెంబర్ నెలలో ఈ ప్రాంతంలో కురవాల్సిన వర్షం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయింది. మొరాకో రాజధాని రబాత్ నగరానికి దక్షిణంగా 450 కిలోమీటర్లు దూరంలో ఉన్న టాగో నైట్ గ్రామంలో గత 24 గంటల వ్యవధిలో 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.వర్షాలు విస్తారంగా కురవడంతో సహారా ఎడారి ప్రాంతం సముద్రం లాగా కనిపిస్తోంది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో సందడి చేయడంతో పర్యాటకులు ఈ ప్రాంతానికి తరలివస్తున్నారు. ఈత చెట్లు, ఖర్జూర చెట్ల మధ్య ఏర్పడిన నీటి గుంతులను చూసి ఆశ్చర్యపోతున్నారు. ” ఈ దృశ్యాలను మేము నమ్మలేకపోతున్నాం. సహారా ఎడారిలో ఈ స్థాయిలో వర్షాలకురుస్తున్నాయంటే ఆశ్చర్యంగా ఉంది. గత 50 సంవత్సరాలలో మొదటిసారిగా ఇక్కడ వర్షపాతం నమోదయింది. ఇది మాకు సంభ్రమాశ్చర్యానికి గురిచేస్తోందని” మొరాకో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మెటీరియాలజీ హుస్సేన్ పేర్కొన్నారు. గత ఆరు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో దారుణమైన కరువు ఏర్పడింది. దీంతో రైతులు తమ పొలాలను మొత్తం బీడుగా ఉంచారు. అయితే ఇప్పుడు వర్షాలు కురవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ పొలాలను తిరిగి సాగు చేసుకుంటామని చెబుతున్నారు.. ఇక భారీ వర్షాలు కురవడం వల్ల అల్జీరియా ప్రాంతంలో 20 మందికి పైగా కన్నుమూశారు. వేలాది ఎకరాలలో ఖర్జూర తోటలు దెబ్బతిన్నాయి. దీంతో ప్రభుత్వం వరద సహాయక చర్యలను చేపట్టింది. జాగోర – టాటా మధ్య 50 సంవత్సరాలుగా ఎండిపోయిన ఇరిగి అనే సరస్సు రెండుగా నీటితో కనిపిస్తోంది. నాసా విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాలలో ఈ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొన్ని సంవత్సరాలుగా కరువు తాండవం చేయడంతో.. చాలామంది విదేశాలకు వలస వెళ్లిపోయారు. కొంతమంది రైతులు భూములను అడ్డగోలు ధరలకు అమ్ముకున్నారు. తీరా ఇన్ని సంవత్సరాల తర్వాత వర్షాలు కురవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన నీటి వనరులు జల కళ ను సంతరించుకున్నాయి. అయితే మరి కొద్ది రోజులపాటు ఈ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.