సిరా న్యూస్,జయశంకర్ భూపాలపల్లి;
రైతు నుండి ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు.
మంగళవారం మొగుళ్లపల్లి. మండల పరిధిలోని మొగుళ్లపల్లి, ఇస్సిపేట గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పీఏసీఎస్ గోడౌన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ, రైతులకు అందిస్తున్న సదుపాయాలు, గోడౌన్‌లో గన్ని సంచులు పరిశీలించారు. ధాన్యం విక్రయ కేంద్రాల్లో రైతుల సమస్యలు తెలుసుకొని, వాటికి తగిన పరిష్కారాలు చూపేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులు దాన్యం విక్రయాల్లో నాణ్యత పాటించాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకు సకాలంలో చెల్లింపులు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన దాన్యం తేమశాతాన్ని పరిశీలించారు.
రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన రైతులకు సూచించారు. దళారులను ఆశ్రయించి తక్కువ ధరకు విక్రయాలు చేయొద్దని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో మంచినీరు, నీడ కొరకు షామియానాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనాధ్,డీఎం రాములు, డీసీఓ వాలియా నాయక్, తహశీల్దార్ సునీత తదితరులు పాల్గొన్నారు.