అధిష్టానానికి తమ్ముళ్ల వినతి
సిరా న్యూస్,ఏలూరు;
ఏలూరు జిల్లాలో ఆయన పరిచయం అక్కర్లేని నేత. 2019 నుంచి 2024 వరకు ఓ వెలుగు వెలిగారు. కానీ 2024 ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ వెంటనే వైసీపీకి రాంరాం చెప్పారు. ఇప్పుడు టీడీపీలో చేరడానికి ట్రై చేస్తున్నారు. అయితే టీడీపీ హౌస్ ఫుల్ బోర్డు పెట్టేసింది. ఆయన్ను చేర్చుకోవద్దని తెలుగు తమ్ముళ్లు కోరుతున్నారు.ఏలూరు జిల్లా రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్‌గా ఉంటాయి. ఇక్కడ అంతా క్యాస్ట్ పాలిటిక్స్ నడుస్తాయి. అవే ఎన్నికలపై ప్రభావం చూపుతాయి. అందుకే ప్రధాన పార్టీలు చాలా జాగ్రత్తలు తీసుకొని అభ్యర్థులను రంగంలోకి దింపుతాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఏలూరులో రసవత్తరంగా సాగాయి. ఎట్టకేలకు కూటమి అభ్యర్థి విజయం సాధించారు.ఇక్కడిదాకా బాగానే ఉన్నా.. ఇప్పుడు రాజకీయం వేగంగా మారుతోంది. 2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన ఆళ్ల నాని ఓడిపోయారు. ఓటమి తర్వాత నాని జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. దీంతో ఆయన జనసేనలో చేరతారనే ప్రచారం జరిగింది. కానీ.. అనూహ్యంగా ఆళ్ల నాని టీడీపీలో చేరడానికి ప్రయత్నిస్తున్నట్టు తాజాగా వార్తలు వస్తున్నాయి.ఇప్పటికే టీడీపీలోని కీలక నేతలతో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. ఏలూరులో తన ఉనికిని కాపాడుకోవాలంటే.. ప్రాధాన్యత ఉన్న పోస్టు కావాలని.. ఆ హామీ ఇస్తేనే పార్టీలో చేరతానని నాని చెప్పినట్టు తెలిసింది. కానీ.. పార్టీ నుంచి మాత్రం స్పష్టమైన హామీ నానికి లభించలేదు. పక్కా హామీ కోసం ఆళ్ల నాని వెయిట్ చేస్తున్నట్టు ఏలూరులో టాక్.అయితే అసలు సమస్య ఇక్కడే మొదలైంది. ఆళ్ల నాని టీడీపీలో కీలక నేతలను కలిశారని తెలియగానే.. ఏలూరు టౌన్‌లోని కొందరు టీడీపీ నాయకులు లోకేష్ దగ్గరకు వెళ్లినట్టు తెలిసింది. 2019 నుంచి 2024 వరకు ఆళ్ల నాని తమను ఇబ్బందులకు గురిచేశారని.. ఆయన్ను పార్టీలో చేర్చుకోవద్దని స్పష్టం చేసినట్టు సమాచారం. అటు లోకేష్ కూడా వారి వాదనతో అంగీకరించినట్టు తెలిసింది.కూటమి అధికారంలోకి వచ్చాక.. ఏలూరు జిల్లా వైసీపీ దాదాపు ఖాళీ అయ్యింది. కీలక నేతలు అందరూ అటు జనసేనలోనో.. ఇటు టీడీపీ లోనే జాయిన్ అయ్యారు. దీంతో హౌస్ ఫుల్ అయ్యింది. ఈ కారణంగానే నానిని చేర్చుకోవడానికి ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. నానికి జిల్లా వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉంది. అలాంటి లీడర్ ఏ పదవి లేకుండా టీడీపీలో జాయిన్ అయితే.. విలువ తగ్గిపోతుందని నాని ఫ్యాన్స్ అంటున్నారు.ప్రస్తుతం ఏలూరు ఎమ్మెల్యేగా ఉన్న బడేటి చంటి మాత్రం నాని రాకపై అభ్యంతరం వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. కానీ.. ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రం నాని చేరికను గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రిగా, జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన నానికి ఇలాంటి పరిస్థితి రావడం ఏంటనే చర్చ ఏలూరులో జరుగుతోంది. అయితే.. ఆయన టీడీపలో కాకుండా జనసేనలో చేరితే బాగుంటుంది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.