సిరా న్యూస్,విజయవాడ;
అధికార పార్టీలో కొందరు ఎమ్మెల్యేలను స్థాన చలనం తప్పదని ఇప్పటికే సంకేతాలు జారీ చేసిన వైసీపీ అధిష్ఠాం వారిలో కొందరిని పార్లమెంటుకు పంపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.. అయితే వారి నుంచి మాత్రం ఎటువంటి అంగీకారం కనిపించడం లేదని తెలుస్తోంది. ఫలానా స్థానం నుంచి మీరు ఎంపీగా పోటీచేయాల్సి ఉంటుంది. అందుకు సిద్ధంగా ఉండండి అంటే బాబోయ్ ఎంపీగా పోటీనా.. మావల్లకాదండీ అంటూ ఏదోలా సైడ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారట పలువురు ఎమ్మెల్యేలు..దాదాపు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపి ఒక పార్లమెంటు స్థానం కాగా ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పార్లమెంటు అభ్యర్థులుగా పోటీ చేసేందుకు అభ్యర్ధులు దొరకని పరిస్థితి కనిపిస్తోందట. ఎవ్వరిని వెళ్లమన్నా ఆచితూచి అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలతోపాటు ఆశావహులు ఎవ్వరిని ఎంపీగా పోటీచేయాలని అధిష్ఠానం సూచించినా మావల్ల కాదులేండి అంటున్నారట.ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా మార్గాని భరత్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన్ను రాజమండ్రి సిటీ నుంచి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్ధిగా బరిలో దింపేందుకు ఇప్పటికే నిర్ణయం తీసేసుకుంది పార్టీ. కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను పిఠాపురం పంపించనుందని ప్రచారం సాగుతోంది. అమలాపురం నియోజకవర్గం నుంచి చింతా అనురాధ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తుండగా ఆమె కూడా ఎక్కడో ఓ చోట అసెంబ్లీ సిటు ఇవ్వాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మూడు పార్లమెంటు స్థానాలు ఖాళీ అయిన పరిస్థితి ఉంది. ఈ మూడు స్థానాల్లోనూ ఎవ్వరిని బరిలో దింపాలన్న ఆలోచనలో అధినాయకత్వం నిమగ్నమయ్యింది కానీ అభ్యర్థులు దొరకని పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోందట..ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మూడు పార్లమెంటు నియోజకవర్గాలుండగా అందులో అమలాపురం ఎస్పీ రిజర్వుడు. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాలకు పోటీచేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థులకు ఆర్దీకంగా తోడ్పాటు నందివ్వడం అనేది సంప్రదాయంగా వస్తూ ఉంది. ఎంపీ అభ్యర్ధి ఆవిధంగా సర్దుబాటు చేయకపోతే ఎమ్మెల్యే అభ్యర్థులు క్రాస్ ఓటింగ్‌కు ప్రోత్ససహిస్తారని, ఎంపీకి మీరు ఓటు ఎలా వేసుకున్నా అసెంబ్లీ స్థానానికి మాత్రం తనకే వేయాలని సూచించే అవకాశం లేకపోలేదు. దీంతో ఓటమి తప్పదని భయపడుతున్నారట. అంతే కాకుండా ఎంపీగా గెలిచినా స్థానికంగా అనుకున్నంత పట్టు లభించచదన్న వాదన ముందు నుంచి కనిపిస్తోంది. ఇవన్నీ బేరీజు వేసుకునే పార్లమెంటుకు పోటీ అంటే ముందుకు వెళ్లడం లేదన్నది అభ్యర్థుల్లో కనిపిస్తోందని పలువురు చెప్పుకుంటున్నారు.