31వ రోజు మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్ కు విన్నపాల వెల్లువ..
సిరా న్యూస్,అమరావతి;
ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని మంత్రి భరోసా
అమరావతి: ఉండవల్లిలోని నివాసంలో విద్య, ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్, కు విన్నపాలు వెల్లువెత్తాయి. మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. మంత్రి నారా లోకేష్ ను స్వయంగా కలిసి తమ సమస్యలను విన్నవించారు. 31వ రోజు ప్రజాదర్బార్ లో ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి.. వారి నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు. ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని, సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.
మంగళగిరి నియోజకవర్గం నుంచి వచ్చిన విజ్ఞప్తులు ఇటీవల సంభవించిన వరదలకు తమ ఇళ్లు పూర్తిగా నీటమునిగాయని, ఇంట్లోని వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు ధ్వంసమయ్యాయని ఉండవల్లికి చెందిన సీహెచ్ శ్రీనివాస్, ఏ.సుబ్రహ్మణ్యం, ఎన్.వెంకట్రావు, సైదులు మంత్రి నారా లోకేష్ ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. నష్ట పరిహారం అందించడంతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువుల మరమ్మతుల కోసం విజయవాడ లో మాదిరిగా గుంటూరు జిల్లాలోనూ ఉచిత సర్వీస్ సెంటర్ ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఆభరణాల తయారీ కోసం తాము ఇచ్చిన 630 గ్రాముల బంగారాన్ని మంగళగిరిలో పనిచేసే పశ్చిమ బెంగాల్ కు చెందిన గోబెడ్ అనే వ్యక్తి అపహరించాడని, బంగారంతో పశ్చిమ బెంగాల్ కు పారిపోయిన అతడిని అరెస్ట్ చేసి తమ బంగారాన్ని అప్పగించేలా తగిన చర్యలు తీసుకుని మంగళగిరికి చెందిన భువనగిరి బి.రవికుమార్, పి. కిరణ్, జి. నాగసాయి మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
దివ్యాంగురాలైన తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం ఆర్థికసాయం చేసి ఆదుకోవాలని తాడేపల్లికి చెందిన వనమా అమ్ములు మంత్రి నారా లోకేష్ కలిసి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన సాయం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
మంగళగిరి ఆటోనగర్ లో తమ కుటుంబానికి చెందిన 5 సెంట్ల స్థలాన్ని పఠాన్ ఆలీ బాష, పఠాన్ అశోక్ అన్యాక్రాంతం చేశారని, విచారించి తగిన న్యాయం చేయాలని మసీద్ దరియాబి మంత్రి నారా లోకేష్ ను కలిసి కన్నీటిపర్యంతమయ్యారు. కుమార్తె వివాహం కోసం తమ స్థలం రిజిస్ట్రేషన్ పత్రాలను అప్పటి ఆటోనగర్ ప్రెసిడెంట్ ఆలీ బాష వద్ద తనఖా పెట్టి లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాం. అనంతరం అప్పు చెల్లించి తమ పత్రాలను తిరిగివ్వాలని కోరాం. ఫోర్జరీ సంతకాలతో తమ స్థలాన్ని ఇతరులకు విక్రయించి ఆలీ బాష, పఠాన్ అశోక్ అన్యాయం చేశారు. దోషులను శిక్షించి తమ స్థలాన్ని అప్పగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
తన వద్ద అప్పుగా తీసుకున్న రూ.17 లక్షలను తిరిగి చెల్లించకుండా.. వైసీపీ నేత దేవినేని అవినాష్ అండతో బెదిరిస్తున్నారని ఉండవల్లికి చెందిన కూనపురెడ్డి రమేష్ మంత్రి నారా లోకేష్ ను కలిసి ఫిర్యాదు చేశారు. విజయవాడకు చెందిన బీవీ సుబ్బారెడ్డి తన వద్ద రూ.17 లక్షలు అప్పుగా తీసుకున్నారని, దేవినేని అవినాష్ అనుచరులతో కలిసి తనవద్ద ఉన్న ప్రామిసరి నోట్లను, చెక్కులను బలవంతంగా లాక్కున్నారని వాపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదన్నారు. విచారించి తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. మంగళగిరి ఇస్లాంపేటలో నివాసముండే తమకు సొంత ఇంటి స్థలం ఉందని, శాశ్వత ఇల్లు నిర్మించుకునేందుకు తగిన ఆర్థికసాయం చేయాలని షేక్ అన్వర్ విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన విజ్ఞప్తులు
విజయవాడలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తమ ఇల్లు నీటమునిగిందని, ఇంట్లోని సామాగ్రి మొత్తం వరదల్లో కొట్టుకుపోయాయని, తగిన పరిహారం అందించి ఆదుకోవాలని వి.వరలక్ష్మి మంత్రి నారా లోకేష్ ను కలిసి కన్నీటిపర్యంతమయ్యారు. పరిశీలించి తగిన పరిహారం అందజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
డిగ్రీ చదివిన తనకు ఉద్యోగ అవకాశం కల్పించి ఆదుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం దేచర్లకు చెందిన వెలగాల వెంకటేష్ విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్న తమకు శాశ్వత గృహం మంజూరు చేసి ఆదుకోవాలని విజయవాడకు చెందిన పైడ వాణి విన్నవించారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.