తుఫాను నష్టంతో మాకేంటి…

ఇన్సూరెన్స్ కంపెనీల తిరకాసు
సిరా న్యూస్,విజయవాడ;
విజయవాడ వరదల్లో నష్టపోయిన ప్రజల్ని ఆదుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే కొన్ని సంస్థలు మాత్రం విపత్తులో లాభాలను వెదుక్కుంటున్నాయి. దళారులతో కలిసి అందిన కాడికి దోచుకోడానికి ఎత్తులు వేస్తున్నాయి. వరదల్లో మునిగిపోయిన వాహనాలను ఇన్సూరెన్స్ ఎగ్గొట్టడంతో పాటు కారు చౌకగా వాహనాలను దళారులు దక్కించుకునేలా షోరూమ్‌లు, ఇన్సూరెన్స్‌ కంపెనీలు కుమ్మక్కయ్యాయి. రవాణా శాఖ చూసి చూడనట్టు వ్యవహరిస్తుండటంతో ఈ దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది.వరదల్లో మునిగిపోయిన కార్లను కారుచౌకగా కొట్టేయడానికి విజయవాడలో ఇన్సూరెన్స్‌ కంపెనీలు, కార్ల షోరూమ్‌లు కుమ్మక్కయ్యాయి. బుడమేరు వరదలతో సెప్టెంబర్ 1 నుంచి 12వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో వేలాది వాహనాలు నీటి ముంపుకు గురయ్యాయి. వీటిలో ద్విచక్ర వాహనాలకు రూ.3వేలు, ఆటోలకు రూ.10వేలు పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. కార్లు, రవాణా వాహనాలు, గూడ్స్ క్యారియర్లకు మాత్రం పరిహారం ప్రకటించలేదు.వరదల్లో వ్యక్తిగత వాహనాలతో పాటు కమర్షియల్ వాహనాలు కూడా భారీ సంఖ్యలో వరద ముంపుకు గురయ్యాయి. వరదలు తగ్గు ముఖం పట్టిన తర్వాత వాహనాలను షోరూమ్‌లకు తీసుకెళ్లిన యజమానుల్ని అందిన కాడికి దోచుకోడానికి అయా షోరూమ్‌లు ప్రయత్నిస్తున్నాయి.సంక్షోభం సమయంలో కూడా వ్యాపార అవకాశాలను వెదుక్కుంటూ లాభపడేందుకు ప్రయత్నిస్తున్నారు. వాహనాల బీమా మొత్తాన్ని తగ్గించడం, ఫుల్ డామేజ్‌ పేరుతో వాహనాలను కారు చౌకగా దక్కించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొత్త వాహనాలతో పాటు, ఇంకా ఈఎంఐలు పూర్తిగా చెల్లించని వాహనాలను కారు చౌకగా దక్కించుకోడానికి గుంటూరు నుంచి ముఠాలు విజయవాడలో తిరుగుతున్నాయి. నగరంలోని కార్‌ షోరూమ్‌లతో ఒప్పందాలు చేసుకుని వరదల్లో మునిగిన కార్లకు భారీగా అంచనాలు రూపొందిస్తున్నాయి.బయట ఒకటి రెండు లక్షల ఖర్చుతో వరదల్లో మునిగిన వాహనాలను పూర్వపు స్థితికి తెచ్చే అవకాశం ఉన్నా భారీగా అంచనాలు రూపొందిస్తున్నారు. కారు మోడల్‌ను బట్టి ఇన్సూరెన్స్‌ వచ్చే మొత్తాన్ని తక్కువ చేసి చూపిస్తున్నారు. కారు రిపేర్‌కు అయ్యే ఖర్చు కంటే ఇన్సూరెన్స్‌లో తక్కువ ధర వస్తుందని మాటలతో మభ్య పెడుతున్నారు. వీటికి సంబంధించి అంచనాలను అధికారికంగా మంజూరు చేయడం లేదు. రిపేర్ చేయడం కంటే కారును వదిలేసుకోవడం ఉత్తమం అని సలహా ఇస్తున్నారు.ఇలా కొత్ కారు త లేదు, పాతదని లేదు… నీటిలో కారు మునిగితే కాటాకు వేసేయడమేనని మాయ మాటలు చెప్పి వాటిని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. విజయవాడలోని అన్ని కార్ల షోరూమ్‌లలో ఇదే దందా నడుస్తోంది. 2019లో కొనుగోలు చేసిన హ్యుండాయ్ కంపెనీ కారు మరమ్మతులకు రూ.నాలుగున్నర లక్షల అంచనాలు వేసిన షోరూమ్‌ ఇన్సూరెన్స్ మూడు లక్షలు మాత్రమే వస్తుందని దాని బదులు కారును వదిలేసుకోవడం ఉత్తమం అని సలహా ఇచ్చారని ఓ బాధితుడు తెలిపారు. వరదల్లో మునగడానికి వారం రోజులు ముందు కొనుగోలు చేసిన వాహనానికి రిజిస్ట్రేషన్ కాలేదని వేధించారని మరో కారు యజమాని వాపోయాడు.విజయవాడలోని సుజుకీ నెక్సా, మహీంద్రా, కియా, టాటా, హ్యుండాయ్, టయోటా ఇలా అన్ని కంపెనీల షోరూమ్‌లలో వరదల్లో మునిగిన వాహనాలను ఇలాగే చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వాహనాల ఇన్సూరెన్స్ విషయంలో ముఖ్యమంత్రి స్వయంగా సమీక్షలు నిర్వహిస్తున్నా, మరమ్మతుల కంటే వాటిని డిస్పోజ్ చేసేలా యజమానులపై ఒత్తిడి చేస్తున్నాయి.వరదల్లో మునిగిన కార్లను వాటి యజమానులు వదులుకుంటే షోరూమ్‌లకు కొత్త వాహనాలను విక్రయించడానికి వీలవుతుంది. వాటిని తక్కువ ధరకు కొనుగోలు చేసే ముఠాలు సెకండ్ హ్యాండ్‌లో విక్రయించుకునేందుకు వీలవుతుంది. ఇన్సూరెన్స్ కంపెనీలకు, కార్ల షోరూమ్‌లకు మళ్లీ కొత్త వ్యాపారానికి అవకాశం దక్కుతుంది.దీంతో సెకండ్ హ్యాండ్ కార్ల ముఠాలు, షోరూమ్‌లు, ఇన్సూరెన్స్ కంపెనీలు కుమ్మక్కై వరదల్లో పాడైన కార్లతో లాభపడేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రభుత్వం వీటిని కట్టడి చేయడంలో ఎలాంటి చర్యలు చేపట్టక పోవడంతో ఈ ముఠాలు పేట్రెగి పోతున్నాయి.వాహనాలను ఫుల్‌ డామేజ్‌ కింద కంపెనీలకు ఇచ్చేస్తే వాటిని స్క్రాప్‌ కింద నమోదు చేయాల్సి ఉంటుంది. ఇక్కడే షోరూమ్‌లు తెలివిగా వ్యవహరిస్తున్నాయి. వాటిని మరొకరి పేరుతో ట్రాన్స్‌ఫర్‌ చేస్తే ఎంతో కొంత లాభం వస్తుందని మభ్యపెడుతున్నారు. వారి మాటలు నమ్మిన వారు వాహనాలను ఇన్సూరెన్స్‌ కంపెనీలకు అప్పగించేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *