ఆ…ధర్మారెడ్డి ఎక్కడ

సిరా న్యూస్,తిరుమల;
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డులో వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని.. అందులో జంతువుల కొవ్వుల తాలూకు అవశేషాలు ఉన్నాయని కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణలు, బయటపెట్టిన ల్యాబ్ రిపోర్టులు ఎంత సంచలనం రేపుతున్నాయో తెలిసిందే. నాలుగైదు రోజులుగా దేశవ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశం అవుతోంది. జాతీయ మీడియా సైతం ఈ విషయం మీద చర్చలు పెట్టింది.తిరుమల శ్రీవారిని దేశవ్యాప్తంగా కొలిచే భక్తులు ఈ విషయమై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహా వైసీపీ నేతలు ఈ విషయమై ఎదురు దాడి చేసే ప్రయత్నం చేసినా వారి వాదన తర్కానికి నిలవడం లేదు. రోజు రోజుకూ ఈ ఇష్యూలో వైసీపీ ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది. ఐతే వైసీపీని ఇంతగా ఇబ్బందిపెడుతున్న అంశం మీద అసలైన బాధ్యుడు స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.గత ఐదేళ్లు టీటీడీ ఛైర్మన్లుగా ఉన్న వైసీపీ నేతలను మించి కొండ మీద ఎక్కువ ఆధిపత్యం చలాయించింది జగన్‌కు అత్యంత ఇష్టుడైన ధర్మారెడ్డి. టీటీడీ జేఈవో పదవిలో ఆయన అంతులేని అధికారాన్ని అనుభవించారు. కొండ మీద అన్నీ ఆయన కనుసల్లోనే జరిగేవి. జగన్ ధర్మారెడ్డికి ఎక్కడలేని ప్రాధాన్యం ఇచ్చేవారు. పదవీ కాలం ముగిశాక కూడా కొనసాగించడానికే చూశారు. అలాంటి వ్యక్తి తాను చక్రం తిప్పిన రోజుల్లో జరిగిన తప్పుల గురించి వస్తున్న ఆరోపణల మీద ఏమీ స్పందించకుండా సైలెంట్‌గా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.ఒకవేళ వైసీపీ హయాంలో నెయ్యి కల్తీ జరిగి, లడ్డు నాణ్యత దెబ్బ తినడం వాస్తవం అయితే.. అందుకు బాధ్యత వహించాల్సిన వ్యక్తుల్లో ధర్మారెడ్డి కూడా ఒకరు. తనకు జగన్ అంతగా ప్రాధాన్యం ఇచ్చినపుడు.. ఇప్పుడు ఆయనతో పాటు పార్టీకి ఇంత డ్యామేజ్ జరుగుతుంటే కనీసం ఈ ఆరోపణలను ఆయన ఖండించకపోవడం, వివరణ ఇవ్వకపోవడం విడ్డూరం. మరి ధర్మారెడ్డి ఎప్పుడు బయటికి వచ్చి ఈ విషయం మీద మాట్లాడతారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *