ఎవరు గెలిచినా..బీజేపీయేగా…
సిరా న్యూస్,విజయవాడ;
ఏపీలో పొత్తుల సంగతి తేల్చాలని బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. తెలుగుదేశం , జనసేన పార్టీలతో పొత్తులకు వెల్లాలని బీజేపీ నిర్ణయించుకుందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. సీట్ల అంశంపైనా చర్చలు జరుపుతున్నారని చెబుతున్నారు. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకపోవడం వల్లనే బీజేపీకి ఎక్కువగా లాభం ఉంటుందన్న అభిప్రాయం మాత్రం గట్టిగా వినిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ఏపీలో బీజేపీని వ్యతిరేకించే పార్టీలు లేవు. ఏపీలో బీజేపీ బలంగా లేదని ఎవరు చెప్పారని.. ఏపీలో 25 మంది ఎంపీల్లో ఏ పార్టీ గెలిచినా బీజేపీ గెలిచినట్లేనని రాజకీయవర్గాలు సెటైర్లు వేస్తూంటాయి. ఇది నిజం కూడా. ఎందుకంటే ఏపీలో టీడీపీ, వైసీపీ పార్టీకి చెందిన ఎంపీలు బీజేపీకి వ్యతిరేకంగా లేరు. పార్లమెంట్ లో అన్ని విధాలుగా మద్దతిస్తున్నారు. జనసేన పార్టీకి ఎంపీలు లేకపోయినా సపోర్ట్ మాత్రం.. బీజేపీకే ఉంటోంది. అన్ని పార్టీలు బీజేపీకి మద్దతుగానే ఉన్నప్పుడు మరి బీజేపీ ఓ పార్టీతో పొత్తులకు వెళ్లాల్సిన అవసరం ఏమిటన్నది రాజకీయవర్గాలకు అంతుబట్టని విషయం. అయితే బీజేపీ తమ కూటమిలో ఓ పార్టీ ఉండాలని కోరుకుంటోందని చెబుతున్నారు.ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2014 సీన్ 2024 ఎన్నికల్లోనూ రిపీట్ అవుతుందా ? తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు మళ్లీ కలుస్తాయా అన్నది గత ఏడాది కాలంగా పదే పదే ప్రచారంలోకి వస్తూనే ఉంది. కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు అవే సంకేతాలను సూచిస్తున్నాయి. ఆగస్టులో ఢిల్లీలో నిర్వహించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో విభేదాలను పక్కనపెట్టి ప్రధాని మోడీ టీడీపీ అధినేత చంద్రబాబుకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. సమావేశం ముగిసిన తర్వాత ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. దీంతో ఇద్దరు నేతల మధ్య విభేదాలు సమసిపోయాయని రెండు పార్టీల మధ్య పొత్తులు ఉంటాయన్న ప్రచారం అప్పట్లోనే మొదలైంది. 2014 ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేన కాంబినేషన్ హిట్ అయింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు విడివిడిగా పోటీ చేసి అన్ని పార్టీలూ నష్టపోయాయి. టీడీపీ 23 స్థానాలకే పరిమితమైతే జనసేనకు ఒకే ఒక్క సీటు వచ్చింది. బీజేపీ ఒక్క శాతం ఓట్లే దక్కించుకుని నోటా కంటే తక్కువ స్థాయి పార్టీగా నిలిచింది. పవన్ కళ్యాణ్ అనుకున్న స్థాయిలో ప్రభావితం చేయలేకపోయారు. స్వయంగా తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓటమి చెందారు. 2019 ఎన్నికల తర్వాత బీజేపీ-జనసేన తిరిగి ఏకమయ్యాయి. టీడీపీ కూడా బీజేపీతో గ్యాప్ తగ్గించుకునే ప్రయత్నం చేసింది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ.. ఆ కాంబినేషన్ మళ్లీ వర్కవుట్ అవుతుందా..? అనే చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ మధ్య ఉన్న కొద్దిపాటి సమస్యలు పరిష్కారం అవుతాయని.. కలిసే ఎన్నికలకు వెళ్తామని జనసేనాని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేస్తూ వ్సతున్నారు. బహిరంగంగా చెప్పకున్నా.. టీడీపీ-బీజేపీ కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు నిర్ణయం తీసేసుకున్నాయనేలా.. కొంత కాలంగా రాజకీయ ప్రచారం జరుగుతోంది. ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల పాలనా విజయాల ప్రచారం కోసం నిర్వహించిన బహిరంగసభల్లో ఏపీ ప్రభుత్వంపై అమిత్ షా, జేపీ నడ్డా తీవ్ర విమర్శలు చేశారు.ఈ ఏడాదిలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజును తప్పించి పురంధేశ్వరికి బాధ్యతలు అప్పగించారు.