హిందువులపై దాడులు ఎందుకు….

సిరా న్యూస్;
మొన్న బంగ్లాదేశ్… ఈరోజు కెనడా.. రేపు ఇంకెక్కడా..? ఎందుకు హిందువులపై దాడులు జరుగుతున్నాయి..? దౌత్యపరంగా భారత్ కెనడాల మధ్య కొనసాగుతున్న విభేదాల మధ్యలో తాజాగా హిందువులు టార్గెట్ అవ్వడం విస్మయానికి గురిచేసింది. కెనడాలో దివాలీ పూజల కోసం వెళుతున్న హిందువులపై కెనడాలోని ఖలిస్తాన్ మద్దతుదారులు దాడులకు దిగారు. కెనడా పోలీసులు సైతం హిందువులపై దాడి చేశారు. ఈ దాడిని నిరసించే సమయంలోనూ కెనడా పోలీసులు రెచ్చిపోయారు. ఖలిస్తాన్ తీవ్రవాది నిజ్జర్ హత్యతో భారత్, కెనడా మధ్య దౌత్య వివాదాలు రాజుకున్నాయ్. అప్పటి నుండీ కెనడాలోని హిందువులపై, హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయి. వీటితో పాటు ఇరు దేశాల మధ్య దూరం కూడా పెరుగుతూ వచ్చింది. అయినప్పటికీ, కెనడా ప్రధాని మాత్రం తమ దేశంలోని సిక్కు తీవ్రవాదాన్ని సమర్థిస్తూనే ఉన్నారు. ట్రూడో మెతక వైఖరి వల్ల కెనడాలో మూడవ అతిపెద్ద మతంగా ఉన్న హిందూ మత ఉనికికే ప్రమాదం ఏర్పడే పరిస్థితి వస్తోందని హిందూ వాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉద్రిక్తతలు తగ్గెదెప్పుడా అని కెనడాలోని హిందువులు ఎదురుచూస్తున్నారు.ఏ దేశమైనా మరో దేశ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చాలంటే ఒక అంతర్జాతీయ కారణం ఉండాలి. లేదంటే, అది తమ దేశంపై ఏదైనా ప్రభావం చూపుతుండాలి. అదీకాదూ అంటే, మానవహక్కుల ఉల్లంఘన వంటి వ్యవహారాల్లో సలహాలు, సూచనలు ఇవ్వొచ్చే. అలాకాదని, కేవలం తన రాజకీయ లాభాల కోసం భారతదేశంపై బురద చల్లాలనుకుంటున్నారు కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో. భారత ప్రభుత్వంపై ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. కెనడా గడ్డపై జరుగుతున్న తీవ్రమైన నేరపూరిత చర్యల్లో భారత్‌కు ప్రత్యక్ష ప్రమేయం ఉందని ఆరోపించినప్పటి నుండీ తన మాటల్లో నిజముందని చెప్పడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.తాము చేసిన ఆరోపణలకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలను చూపించలేదు సరికదా.. ఇటీవల చేసిన కొత్త వాదనలో.. కెనడాలో ఖలిస్థాన్ అనుకూల అంశాలను లక్ష్యంగా చేసుకోవడానికి, లారెన్స్ బిష్ణోయ్ ముఠాతో కలిసి భారత్ ఏజెంట్లు పనిచేస్తున్నారని కెనడా అధికారులు ఆరోపించారు. అక్టోబర్ 14 అర్థరాత్రి ప్రెస్‌‌తో మాట్లాడిన రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ అధికారులు భారత్‌ను నిందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. నిజ్జర్ హత్యలో అనుమానితుల జాబితాలో కెనడాలోని భారత్ హైకమీషనర్ సంజయ్ వర్మ, ఇతర దౌత్యవేత్తల పేర్లను చేర్చారు.సిక్కు వేర్పాటు వాదులైన ఖలిస్థానీ తీవ్రవాదులు చేసే వ్యవస్థీకృత నేరాలతో సంబంధాలున్న వ్యక్తులకు కెనడా రక్షణ కల్పించడపై భారత్ దశాబ్ధాలుగా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే, ఈ ఏడాది మేలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్.. నిజ్జర్ హత్యతో సంబంధం ఉన్న ముగ్గురు భారతీయులను అరెస్టు చేసిన తర్వాత కెనడా ఇమ్మిగ్రేషన్ విధానాన్ని విమర్శించారు. పంజాబ్ నుండి వ్యవస్థీకృత నేరాలతో లింక్‌లు ఉన్న చాలా మంది ఖలిస్థానీ తీవ్రవాదులను కెనడా స్వాగతిస్తుందనీ ఆరోపించారు. వీళ్లు భారతదేశంలో వాంటెడ్ క్రిమినల్స్ అనీ.. మీరు వారికి వీసాలు ఇచ్చారని కెనడా ప్రభుత్వాన్ని విమర్శించారు.ఇక, అక్టోబర్ 14న భారత హైకమిషనర్‌పై కెనడా అధికారులు ఆరోపణలు చేసిన తర్వాత, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఘాటైన ప్రకటనను విడుదల చేసింది. కెనడా ప్రధాని ట్రూడో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నట్లు పేర్కొంది. దీనికి నిరసనగా, ఆరుగురు కెనడియన్ దౌత్యవేత్తలను బహిష్కరించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే, కెనడాలోని తమ హైకమిషనర్‌ సంజయ్ వర్మతో పాటు, మరికొందరు దౌత్యవేత్తలను కాల్ బ్యాక్ చేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. అయితే, భారత్ ఈ ప్రకటన చేసిన కొన్ని గంటల తర్వాత కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు. ఆరుగురు భారత దౌత్యవేత్తలను తామే బహిష్కరించామని ఆయన చెప్పారు. నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వం సహకరించకపోవడమే ఇందుకు కారణమని ట్రూడో అన్నారు.కెనడాలో ఉన్న సిక్కు డయాస్పోరాలో ఖలిస్థాన్ ఉద్యమానికి మద్దతు ఉందనేది బహిరంగ రహస్యం. టెర్రర్ గ్రూపులకు మద్దతు ఇచ్చే కనీసం తొమ్మిది వేర్పాటువాద సంస్థలకు కెనడాలో స్థావరాలున్నట్లు సమాచారం ఉంది. వీటిపైన అనేకసార్లు బహిష్కరణ వేటుకూడా వేశారు. అయినప్పటికీ, కెనాడా దీనిపై చర్యలు తీసుకోలేదు. ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యతో సహా ఘోరమైన నేరాలకు పాల్పడిన ఖలిస్థాన్ తీవ్రవాదులపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదని న్యూఢిల్లీలోని అధికారులు ఇటీవల వెల్లడించారు. వరల్డ్ సిక్ ఆర్గనైజేషన్-డబ్ల్యూఎస్‌ఓ, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ (కెటిఎఫ్), సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్‌ఎఫ్‌జె), బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బికెఐ) వంటి ఖలిస్తాన్ అనుకూల సంస్థలు కెనడియన్ నేలపైన పాకిస్తాన్ ఆదేశానుసారం పని చేస్తున్నాయని భారత్ ఆరోపిస్తూనే ఉంది. అయినప్పటికీ, కెనడాలో యదేచ్ఛగా తీవ్రవాద కార్యకలాపాలు నడుస్తూనే ఉన్నాయ్.ఖలిస్థాన్ వాంటెడ్ టెర్రరిస్టులు, గ్యాంగ్‌స్టర్ల బహిష్కరణ అంశాన్ని, గతంలో కెనడా, భారత్‌ల మధ్య జరిగిన అనేక దౌత్య, భద్రతా చర్చల్లో భారత అధికారులు ప్రస్తావించారు. కానీ, కెనడా అధికారులు ఈ సమస్యను పట్టించుకోక పోగా… ఉగ్రవాద వ్యవహారల్లో మద్దతు ఇస్తూ వస్తున్నారు. దీనికి ఆధారాలు కూడా లేకపోలేదు. కెనడాలో ఖలిస్థాన్ ఉద్యమానికి సపోర్ట్‌గా అనేక పత్రాలు వ్యాప్తిలో ఉన్నాయి. ఖలిస్థాన్ మద్దతులో నడిచే ర్యాలీలు, సభలు యధేచ్ఛగా నడుస్తున్నాయి. కెనడాలోని హిందూ దేవాలయాలే లక్ష్యంగా హిందూ, భారత వ్యతిరేక పోస్టర్లు, గ్రాఫిటీ ప్రచారాలు తరుచుగా దర్శనిమిస్తాయి.ఆగస్ట్ 2024లో, ఖలిస్తాన్ అనుకూల బృందం భారత స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్ కోసం ఏర్పాటు చేసిన ఒక వేదిక వద్దకు వచ్చి, “కెనడియన్ హిందువులు భారతదేశానికి తిరిగి వెళ్లండి” అని అరిచారు. ఈ సంఘటనకు ముందు, వేర్పాటువాద గ్రూపు అయిన సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ… ఖలిస్తానీ సిక్కులు-కెనడియన్ హిందువుల మధ్య “ముఖాముఖి” కోసం పిలుపునిస్తూ ఫ్లైయర్‌లను ప్రసారం చేసింది. వాటన్నింటినీ కెనడా ప్రభుత్వం ఎప్పుడూ నిరోధించడానికి ప్రయత్నించలేదు. అలాగే, భారతీయ హిందువులపై జరిగి దాడులను కూడా ఆపలేదు.బంగ్లాదేశ్‌లో కూడా ఇటీవల హిందువులపై దాడులకు సంబంధించిన ఆందోళనలు పెరిగాయి. దీనిపై, అక్కడి తాత్కాలిక ప్రభుత్వ చీఫ్, నోబుల్ గ్రహీత మహ్మద్ యూనస్ స్పందిస్తూ… అలాంటి సంఘటనలు పెద్దగా జరగట్లేదన్నట్లే చెప్పారు. కెనడా ప్రధాని ట్రూడో మాదిరి యూనస్ కూడా బంగ్లాదేశ్‌లో హిందువులకు రక్షణ కల్పిస్తామంటూ హామిలిచ్చారు. ఇటు బంగ్లాదేశ్‌లో, అటు కెనడాలో హిందువులపై దాడులను చూస్తుంటే భవిష్యత్తు ఆందోళనకరంగా కనిపిస్తుంది. భారతదేశంపై ఉన్న ద్వేషాన్ని చూపించడానికి వాళ్ల దేశంలో పౌరులుగా ఉన్న హిందువులను హింసించడం అన్నది పౌర హక్కులకు భగం కలిగించడం మాత్రమే కాదు, ఇది మానవ హక్కులను కూడా కాలరాయడమే అవుతుంది. అంతకుమించి, రాజకీయ లబ్ధీ కోసం తమ దేశ గౌరవాన్ని తగలబెట్టి, చలికాచుకోవడమే అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *