సిరా న్యూస్,ముంబై;
జైలు ఖైదీగా ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయిని ఎవరైనా హత్య చేస్తే వారికి రూ.1,11,11,111 (కోటి 11 లక్షల 11 వేల నూట పదకొండు) బహుమానం ఇస్తామని రాజస్థాన్ కు చెందిన క్షత్రియ కర్ణి సేన ప్రకటించింది. డిసెంబర్ 2023లో క్షత్రియ కర్ణి సేన అగ్రనేత, రాజ్‌పుత్ నాయకుడు అయిన సుఖ్‌దేవ్ సింగ్ గోగామేడీ హత్యకు ప్రతీకారంగా కర్ణి సేన ప్రస్తుత నాయకుడు రాజ్ శెఖావత్.. బహిరంగంగా ఈ హత్యకు బహుమతి ప్రకటించడంతో దేశంలో సంచలనంగా మారింది.సోషల్ మీడియాలో రాజ్ శెఖావత్ ఈ ప్రకటన చేస్తున్న వీడియో ఒకటి బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ఎవరైనా పోలీస్ ఆఫీసర్ జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయిని హత్య చేస్తే.. వారికి కర్ణిసేన నగదు బహుమతి ఇస్తుందని భారీ ఆఫర్ ప్రకటించాడు.దేశ సరిహద్దుల్లో డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న లారెన్స్ బిష్ణోయి ప్రస్తుతం గుజరాత్ లోని సాబర్మతి జైల్లో ఉన్నాడు. అతనిపై పలువురి హత్య, కిడ్నాపింగ్ కేసులు విచారణలో ఉన్నాయి. ఇటీవల ముంబై నగరంలో బహిరంగంగా జరిగిన రాజకీయ నాయకుడు బాబా సిద్దిఖి హత్యకు కూడా తమదే బాధ్యత అని ఈ బిష్ణోయి గ్యాంగ్ ప్రకటించడం గమనార్హం.బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కొన్ని నెలల క్రితం తుపాకీతో కాల్పులు జరిపిన కొంతమంది దుండగులు కూడా బిష్ణోయి గ్యాంగ్ సభ్యులేనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకుడు బాబా సిద్ధిఖి.. నటుడు సల్మాన్ ఖాన్ కు సన్నిహితుడు కావడం వల్లనే హత్య చేయబడినట్లు ప్రచారం జరుగుతోంది.రాజస్థాన్ లోని క్షత్రియ కర్ణి సేన విషయానికి వస్తే.. కర్ణిసేన నాయకుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగామేడీని డిసెంబర్ 2023లో పట్టపగలు ఆయన ఇంట్లో కొందరితో సమావేశం చేస్తుండగా.. ముగ్గురు యువకులు వచ్చి అనూహ్యంగా కాల్పులు జరిపారు. ఈ ఘటన సుఖ్‌దేవ్ సింగ్ గోగామేడీ స్పాట్ లో చనిపోగా, ఆయన సెక్యూరిటీ గార్డు తీవ్ర గాయాలపాలయ్యాడు. ముగ్గురు షూటర్లలో ఒకరు నవీన్ సింగ్ శెఖావత్ కూడా ఎదురుకాల్పుల్లో మరణించాడు.సుఖ్‌దేవ్ సింగ్ గోగామేడీ హత్య జరిగిన రెండు రోజుల తరువాత లారెన్స్ బిష్ణోయి, గోల్డీ బ్రార్ గ్యాంగ్‌కు చెందిన రోహిత్ గొడారా ఈ హత్యకు తమదే బాధ్యత అని సోషల్ మీడియాలో ప్రకటించడం గమనార్హం. “రోహిత్ గొడారా కపుర్సారీ అనే నేను.. గోల్డీ బ్రార్ సోదరుడిని. సుఖ్ దేవ్ సింగ్ గోగామేడీ మా శత్రువులకు సాయం చేసినందుకు అతడిని హత్య చేశాము. గోగామేడీ హత్య పూర్తి బాధ్యత మాదే.” అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.గోగామేడీ హత్యలో రాజస్థాన్ రాష్ట్రంలో హింసాత్మక నిరసనలు మొదలయ్యాయి. తమ నాయకుడి హత్యకు ప్రతీకారం కోరుతూ కర్ణి సేన కార్యకర్తలు చేసిన ప్రదర్శనలు, అలర్లుగా మారి రాష్ట్రం అట్టుడికిపోయింది. గోగామేడీ మృతితో రాజస్థాన్ లోని రాజ్‌పుత్ సామాజికవర్గం కోపానికి రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడానికి కూడా ఇది ఒక కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ప్రస్తుతం కర్ణి సేన అధ్యక్షుడు రాజ్ శెఖావత్ విడుదల చేసిన వీడియోలో.. “మా నాయకుడు, కర్ణి సేన ఆణిముత్యం అమర సుఖ్‌దేవ్ సింగ్ గోగామేడీజీని హత్య చేసింది లారెన్స్ బిష్ణోయినే. అతడిని చంపిన వారికి క్షత్రియ కర్ణి సేన తరపున రూ.1,11,11,111 బహుమతి ప్రకటిస్తున్నాను. ముఖ్యంగా అతడిని కాల్చి చంపే పోలీస్ అధికారులకు ఈ ఆఫర్ ” అని ప్రకటించాడుసుఖ్‌దేవ్ సింగ్ గోగామేడీ హత్య తరువాత పోలీసులు అశోక్ మేఘ్వాల్ తోపాటు మరో 8 మంది ఈ హత్య కేసుల అరెస్టు చేశారు. చాలా రాష్ట్రాల్లో ఈ హత్య కేసు విచారణ సాగుతోంది. జాతీయ విచారణ ఏజెన్స్ ఎన్ఐఏ కూడా ఈ కేసుని టేకప్ చేసి రాజస్థాన్, హర్యాణా రాష్ట్రాల్లో 31 చోట్ల తనిఖీలు చేసింది. ఈ తనిఖీల్లో భారీ మోతాదులో తుపాకీలు, బాంబు, మొబైల్ ఫోన్స్, సిమ్ కార్డస్, డిజిటర్ వీడియో రికార్డర్స్ తో పాటు పలు ఆర్థిక లావాదేవీల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కానీ ఈ హత్యకు తనదే బాధ్యత అని ప్రకటించిన రోహిత్ గోడారా మాత్రం ఇంకా పరారీలో ఉన్నాడు. అతడు నకిలీ పాస్ పోర్ట్ లో విదేశాలకు పారిపోయి కెనెడాలో తలదాచుకున్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం. 32 క్రిమినల్ కేసుల్లో నిందితుడుగా ఉన్న రోహిత్ గొడారా.. ఇండియాలో ది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ లో ఒకడు.