కేరళ నుంచే వేరియంట్‌ జేఎన్‌–1 ఎందుకు…

సిరా న్యూస్;
ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా.. కేరళ వారు ఒకరు ఉంటారు అంటారు. ఇది వాస్తవమే. భారత్ లోని మిగతా రాష్ట్రాల కంటే కేరళ చాలా ముందుంటుంది. అన్ని రంగాల్లోనూ ఆ రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తుంది కూడా. దేశంలోనే తొలి వంద శాతం అక్షరాస్యత సాధించిన జిల్లా కేరళలోని కొట్టాయం అని 40 ఏళ్ల క్రితమే పాఠ్య పుస్తకాల్లో రాశారు. అంతటి ప్రగతి కేరళ సొంతం.
అంతేకాదు.. నర్సింగ్ నుంచి మేనేజ్ మెంట్ దాకా వివిధ రంగాల్లోని ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడంలోనూ కేరళీయులకు మరే భారత రాష్ట్ర పౌరులు సాటిరారు. గల్ప్, అమెరికా, కెనడా, సింగపూర్, మలేసియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్.. ఇలా ఎక్కడైనా కేరళ వాసుల విజయ పతాకను చూస్తుంటాం. అనేక ఆయుర్వేద ఔషధాలకు, ప్రకృతి సంపదకు కేరళ రాష్ట్రం నెలవు. అందమైన ఈ కేరల రాష్ట్రం ఇప్పుడు వైరస్‌కు కేరాఫ్‌గా మారుతోంది. దేశంలో కోవిడ్‌తో మొదలు తాజాగా కొత్త వేరియంట్‌ జేఎన్‌–1 వరకు అన్ని వైరస్‌ల వ్యాప్తి ఇక్కడి నుంచే మొదలైంది. రాష్ట్రానికి చెందిన 79 ఏళ్ల మహిళలో ఈ కొత్త వైరస్‌ను కనుగొన్నారు. ఇక రాష్ట్రంలో డిసెంబర్‌ 1 నుంచి 17 వరకు ఈ వైరస్‌తో 10 మంది మరణించడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో అప్రమత్తమైన కేంద్రం.. అన్ని రాష్ట్రాలను అలర్ట్‌ చేసింది.కోవిడ్‌ కేసుల్లో దేశంలో కేరళ మొదటి స్థానంలో ఉంది. తొలి కోవిడ్‌ కేసు కూడా చైనా నుంచి కేరళకు వచ్చిన యువకుడిలోనే నమోదైంది. ఇక తాజాగా కొత్త వేరియంట్‌ జేఎన్‌–1 కూడా కేరళలోనే వెలుగు చూసింది. ఇక తాజాగా నమోదవుతున్న కోవిడ్‌ కేసులు కేరలలోనే ఎక్కువగా ఉంటున్నాయి. డిసెంబర్‌ 16న, కేరళలో 302 కొత్త కోవిడ్‌ కేసులు నమోదు కాగా నలుగురు మరణించారు. డిసెంబర్‌ 10న 109 కేసులు వెలుగు చూశాయి. డిసెంబర్‌ 12న కేసుల సంఖ్య 200కు పెరిగింది. 17న 300 కొత్త కేసులు నమోదయ్యాయి.జేఎన్‌–1 కొత్త వేరియంట్‌ను మొదట ఆగస్టులో కేరళలో గుర్తించారు. ఈ వైరస్‌ అంతకు ముందు చైనా అమెరికా, సింగపూర్‌లో వెలుగు చూసింది. కొత్త ఉప–వేరియంట్‌ వల్ల కలిగే కోవిడ్‌–19 కు సంబంధించిన లక్షణాలు, తీవ్రతపై, ఆరోగ్య కార్యదర్శి, రాష్ట్రాలతో ప్రభుత్వం పంచుకున్న అనుబంధంలో, జేఎన్‌–1 సంక్రమణ ఇతర వేరియంట్ల నుంచి ∙వేర్వేరు లక్షణాలను ఉత్పత్తి చేస్తుందో లేదో తెలియదు .నిఫా.. జికా.. కొవిడ్.. మంకీ పాక్స్.. భారత్ లో ఏ వైరస్ కేసయినా తొలిగా కనిపిస్తోంది కేరళలోనే. తాజాగా దేశంలో రెండు మంకీ పాక్స్ కేసులు రాగా.. రెండూ కేరళవే. వీరిద్దరూ ఇతర దేశాల నుంచి వచ్చిన వారే. ఈ ఏడాది ప్రారంభంలో నిఫా వైరస్ కేరళను వణికించింది. అయితే, వ్యాప్తి అక్కడితోనే ఆగిపోయింది. ఇక జికా వైరస్ గురించి కూడా కేరళలో కలకలం రేపింది. ఏడిస్ ఈజిప్టై దోమ కుట్టడం ద్వారా వ్యాపించే ఈ వ్యాధి బారినపడినవారు పెద్దఎత్తున ఉన్నారు.ఇవే దోమలు చికన్ గన్యా, డెంగీని కూడా వ్యాపింపజేస్తాయి. నిఫా వైరస్ గబ్బిలాల నుంచి వ్యాపిస్తుంది. వాటి లాలాజలం, మూత్రం, రక్తంలో ఈ వైరస్ ఉంటుంది. పండ్లు, పందులు, ఇతర మార్గాల ద్వారా మనుషులకు అంటుకుంటుంది. మెదడుపై ప్రభావం చూపే ఈ వైరస్ కారణంగా 40 నుంచి 75 శాతం మంది రోగులు చనిపోయే ప్రమాదం ఉంది.తొలి రెండు కొవిడ్ కేసులు ప్రపంచాన్ని మూడేళ్లుగా వణికిస్తున్న కొవిడ్ కు సంబంధించి భారత్ లో తొలి కేసు కేరళలోనే నమోదైంది. చైనా నుంచి వైద్య విద్యార్థినికి 2020 జనవరి 27న పాజిటివ్ గా తేలింది. రెండో కేసు కూడా ఈ రాష్ట్రంలోనే నమోదైంది. అయితే, వీరు త్వరగానే కోలుకున్నారు. కాకపోతే.. భారత్ లో కొవిడ్ తొలి కేసులుగా ముద్రపడ్డారు. కాగా, తదనంతర పరిస్థితుల్లో కొవిడ్ దేశంలోనే కాక ప్రపంచంలో ఎంతటి ప్రళయం రేపిందో అందరికీ తెలిసిందే. కొవిడ్ రెండో, మూడో వేవ్ లోనూ కేరళలో కేసులు అత్యధికంగా వచ్చాయి.కొత్త వేరియంట్‌ కేసులు కేరళలో పెరుగుతుండడంతో ఆరోగ్య కార్యదర్శి అన్ని రాష్ట్రాలను అలర్ట్‌ చేశారు. కోవిడ్‌ –19 పరిస్థితిపై నిరంతరం జాగరణను కొనసాగించాల్సిన అవసరాన్ని కేరళకు ప్రత్యేకంగా సూచించారు. జిల్లా వారీగా ఇన్‌ఫ్లూంజా లాంటి అనారోగ్యం – తీవ్రమైన అక్యూట్‌ రెస్పిరేటరీ అనారోగ్యం కేసులను అన్ని ఆరోగ్య సదుపాయాలలో రోజూ ఇంటిగ్రేటెడ్‌ హెల్త్‌ ఇన్ఫర్మేషన్‌ ప్లాట్‌ఫాం పోర్టల్‌తో సహా, గుర్తించడానికి ఆయన కోరారు.ఇక కేరళలోనే కొత్త వైరస్‌లు వెలుగు చూడడానికి ప్రధాన కారణం ఇక్కడి నుంచి నిత్యం వేలాది మంది విదేశాలకు రాకపోకలు సాగించడమే. అక్షరాస్యత, ఉన్నత విద్యావంతులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఉద్యోగాలు, ఉపాధి కోసం విదేశాలకు వెళ్తున్నారు. మరోవైపు కేరళ పర్యాటక రాష్ట్రం కావడంతో విదేశీయులు కూడా ఎక్కువగా కేరళకు వస్తుంటారు. ఇత విదేశాలకు వెళ్లే కేరళ వాసులు, కేరళ నుంచి కేరళకు వస్తున్న విదేశీయులు కొత్త కొత్త వైరస్‌లను మొసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేరళలోనే కొత్త వైరస్‌లు వెలుగులోకి వస్తున్నాయి. ఇక కేరళలో దట్టమైన అడవులు ఉండడం, గబ్బిలాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటోంది. విదేశాల నుంచి కూడా పక్షలు ఇక్కడికి వస్తుంటాయి. వీటి ద్వారా కూడా కొత్త రకమైన వైరస్‌లు కేరళకు వస్తున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *