సిరా న్యూస్,వరంగల్;
తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో అడవులు ఎక్కువ. ఈ అడవుల్లో అంతరించిపోతున్న జాతులకు చెందిన జంతువులు ఉన్నాయి. వాటిని వేటాడి.. కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దందాలో రాజకీయ నాయకులు ఉండటం గమనార్హం.తెలంగాణలోని గోదావరి తీరం వెంట దట్టమైన అడవి ఉంది. ఆ ఆకుపచ్చని అడవులు జంతువుల ఆవాసానికి అనుకూలంగా ఉంటాయి. కానీ.. ఇటీవల వేటగాళ్లతో అడవి జంతువులకు ముప్పు తప్పట్లేదు. గుట్టుగా వాటిని వేటాడి గోళ్లు, మాంసం, చర్మంతో వ్యాపారం చేస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా.. వేట ఆగడం లేదు.వరంగల్ జిల్లాలో ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అడవుల్లో ఉండే అరుదైన జంతువులను.. ఏకంగా ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టారు. తాజాగా.. అలుగు (పాంగోలిన్)ను అమ్మేందుకు రెడీ అయ్యారు. కానీ.. వారికి చెక్ పెట్టారు. వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బోర్డు సభ్యులుపులి, చిరుతపులి, అలుగు, నక్షత్ర తాబేలు, రెండు తలల పాము, ఏనుగు దంతాలకు భారీగా డిమాండ్ ఉంటుంది. దీంతో ఈ జంతువులను వేటాడేందుకు ముఠాలు తిరుగుతున్నాయి. ఆ ముఠాకు ప్రత్యేకంగా ఓ వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ గ్రూపులో వారికి చిక్కిన అరుదైన జంతువు వివరాలను పోస్టు చేస్తారు. ఎంత ధరకు అమ్ముతారో చెబుతారు. కావాల్సిన వారు.. ముఠా దగ్గరకు వచ్చి.. డబ్బులు ఇచ్చి తీసుకెళ్తుంటారు.తాజాగా.. వరంగల్ జిల్లాకు చెందిన ఓ ముఠాకు.. అలుగు చిక్కింది. దాన్ని ఒకరు రూ.30 వేలకు కొన్నారు. అలుగు పొలుసులకు డిమాండ్ ఉండటంతో.. అది కాస్త చేతులు మారి రూ.3 లక్షల ధర పలికింది. ఈ విషయం చెన్నై కేంద్రంగా నడిచే వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బోర్డు గుర్తించింది. ఆ వాట్సాప్ గ్రూప్‌లో బ్యూరో సభ్యులు కొనుగోలుదారులుగా సంప్రదింపులు చేశారు. ఇద్దరు సభ్యులు ఆ నెంబర్ల ఆధారంగా చాట్ చేసుకుంటూ వరంగల్ వచ్చారు. భూపాలపల్లి, కాటారం ప్రాంతాలకు వెళ్లారు. అలుగును, ముగ్గురు నిందితులను పట్టుకున్నారు.పాంగోలిన్ అమ్మకానికి సంబంధించి.. ముగ్గురిని పట్టుకున్నారు. దీని వెనుక 8 మంది ఉన్నట్టు అనుమానిస్తున్నారు. భూపాలపల్లి, కాటారం, మహాముత్తారం మండలాలకు చెందిన వారు ఉన్నారని తెలుస్తోంది. వీరిలో ఓ రాజకీయ పార్టీ నేత కూడా ఉన్నారని సమాచారం.అలుగు వంటి అరుదైన వన్యప్రాణుల అమ్మకాలకు పెద్ద నెట్‌వర్క్ ఉన్నట్లు తెలుస్తోంది. పురాతన వస్తువుల పేరిట దేశవ్యాప్త నెట్‌వర్క్‌తో ఓ వాట్సాప్ గ్రూపు నడుపుతున్నారు. ఇందులో భూపాలపల్లి జిల్లాకు చెందిన కొందరు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వారే అలుగు ఫొటోలను అప్‌లోడ్ చేసి అమ్మకానికి పెట్టినట్టు సమాచారం.