రాజీవ్ గాంధీ విగ్రహంపై ఏర్పాటుపై పార్టీలోనే …

సెంటిమెంట్…
సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ సచివాలయం ముందు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. ఈ నెల 16న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాజీవ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి దీపాదాస్ మున్షీ, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మినహా ఇంకెవరు హాజరుకాలేదు. అయితే వారు రాకపోవడం వెనుక ఉన్న కారణాలని స్వయంగా సీయం రేవంత్ రెడ్డే చెప్పుకొచ్చారు.సచివాలయం ముందు రాజీవ్ విగ్రహం ఏర్పాటుపై తొలి నుంచి రాజకీయ వివాదం నడుస్తోంది. రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేసిన స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం భావించింది. ఐతే అనివార్య కారణాల వల్ల తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు జరగలేదు. ఇంతలో తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. దీంతో సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు సీఎం రేవంత్ రెడ్డి. అనుకున్నదే తడవుగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, ఆవిష్కరించడం కూడా జరిగిపోయాయి.తెలంగాణ తల్లి విగ్రహం కోసం కేటాయించిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై బీఆర్ఎస్ తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలోని కొందరు మంత్రుల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోందన్న చర్చ జరుగుతోంది. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు.. సెంటిమెంట్ తో కూడకున్న వ్యవహారం కావడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. ఇదే అంశాన్ని నెత్తికెత్తుకున్న ప్రతిపక్ష బీఆర్ఎస్.. మరోసారి తెలంగాణ సెంటిమెంట్ ను రాజేసి ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టే ప్రయత్నం చేస్తోందని, ఇది తమకు ఎక్కడ ఇబ్బందికరంగా మారుతుందోననే ఆందోళన లో కొందరు మంత్రులు ఉన్నట్లు టాక్ నడుస్తోంది.గతంలో కేటాయించిన స్థలంలోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసి, అదే ఆవరణలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేద్దామని క్యాబినెట్ లోనే కొందరు మంత్రులు సూచించారని సమాచారం. అది కాదంటే తెలుగు తల్లి ఫ్లైఓవర్ కూడలిలో రాజీవ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మరికొందరు మంత్రులు చెప్పారట. ఐతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఆ ప్రతిపాదనలపై ఏమాత్రం సముఖత వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. ఖచ్చితంగా సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామన్న స్థలంలోనే రాజీవ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేలా మంత్రివర్గంలో తన నిర్ణయాన్ని ప్రకటించారనే టాక్ నడుస్తోంది.ఈ పరిస్థితుల్లో తాము అధికారంలోకి వస్తే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని పదేపదే కేటీఆర్ చెప్తుండటాన్ని పలువురు మంత్రులు ప్రస్తావిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. భవిష్యత్తులో అదే గనుక జరిగితే రాజీవ్ గాంధీని స్వయంగా తామే అవమానించినట్లు అవుతుందని అమాత్యులు వాపోతున్నారట. ఇలాంటి రాజకీయ వివాదాల కారణంగానే రాజీవ్ విగ్రహ ఆవిష్కరణకు అగ్రనేతలు సోనియా, రాహూల్ గాంధీతో ఏఐసీసీ నేతలు ఎవరూ రాలేదన్న చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారమంతా పార్టీ క్యాడర్ లోను, ప్రజల్లోనూ తప్పుడు సంకేతాలు తీసుకెళ్తోందని నేతలు చెబుతున్నారు.పైగా రాజీవ్ గాంధీ విగ్రహ రూపురేఖలపైనా విమర్శలు మొదలయ్యాయి. సచివాలయం ముందు ఏర్పాటు చేసిన రాజీవ్ విగ్రహం ఆయన పోలికలతో లేదంటూ కొందరు సోషల్ మీడియాలో వాపోతున్నారు. హడావుడిగా రూపొందించడం వల్లే ఇలా జరిగిందంటున్నారు. మొత్తానికి రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు విషయంలో రేవంత్ రెడ్డి మంత్రివర్గంతోపాటు, కాంగ్రెస్ పార్టీలోనూ భిన్నాభిప్రాయులు వ్యక్తమవడం చర్చనీయాంశమవుతోంది. దీనికి ఎలాంటి ముగింపు వస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *