సిరాన్యూస్, తలమడుగు:
వందశాతం ఉత్తీర్ణత సాధించాలి..
-తలమడుగు కళాశాలను తనిఖీ చేసిన డిఐఓ రవిందర్..
ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించాలని, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి డిఐఓ రవీందర్ అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఫిబ్రవరి, మార్చిలలో జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలన్నారు. విద్యార్థులు ప్రణాళిక బద్ధంగా చదివితే, 100% ఉత్తీర్ణత సాధ్యమని ఆయన అన్నారు. విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా బాగా కష్టపడి చదువుకోవాలని కోరారు.. అధ్యాపకులు సూచించిన సలహాలు, సూచనలు పాటించాలన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థుల కోసం ప్రభుత్వం ఉచితంగా ఎంసెట్ కోచింగ్ అందిస్తుందననీ, ఈ అవకాశాన్ని విద్యార్థులంతా వినియోగం చేసుకోవాలన్నారు. కాగా ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు అధ్యాపకులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ కళాశాలలోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుందన్నారు. అనంతరం కళాశాలకు సంబంధించిన రిజిస్టర్లను పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట కళాశాల ప్రిన్సిపాల్ మాధవరావు, కళాశాల అధ్యాపకులు, తదితరులు ఉన్నారు.