-నేడు ఆయన వర్ధంతి
సిరా న్యూస్;
డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ నిజమైన వారసుడు, బహుజన సిద్ధాంతకర్త మాన్యశ్రీ కాన్షీరాం అని చెప్పవచ్చు.బహుజన్ సమాజ్ పార్టీ నిర్మాత కాన్షిరామ్ సిక్కు చమార్ కులస్తులైన తేల్సింగ్, బిషన్సింగ్ కౌర్‌లకు మార్చి 15, 1934 పంజాబ్ రాష్ట్రంలో రోపార్ జిల్లా కావాస్పూర్ గ్రామంలోజన్మించాడు. తన 31వ ఏటనే అంబేద్కర్ రచించిన ‘కుల నిర్మూలన ‘ గ్రంథం ద్వారా ప్రేరేపితుడయ్యాడు. తన తల్లికి ముప్పైపేజీల ఉత్తరం రాస్తూ ‘ఇక నుంచి నేను కుటుంబ బాంధవ్యాలను తెంచుకుంటున్నాను. నా కోసం మీరు వెతకవద్దు’ అంటూ బయటికి వెళ్లి, చనిపోయే వరకు తిరిగి ఇంటికి వెళ్లలేదు.
1984 ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించాడు. ‘ఒక ఓటు-ఒక నోటు’ అనే నినాదంతో ప్రజల దగ్గరకు వెళ్లి వారిచ్చే డబ్బుతోనే ప్రచారం చేశాడు. ”కులాన్ని నిర్మూలిద్దాం-బహుజన సమాజాన్ని” నిర్మిద్దాం అంటూ దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టాడు. నువ్వు 85 శాతం ఉండగా 15 శాతం మీద ఎందుకు ఆధారపడతావు? నడువు పార్లమెంటుకు, అసెంబ్లీకి నడువు. నీ కాళ్లమీద నీవే నడువు అంటూ బహుజనులను ఉసిగొల్పాడు.భారతదేశంలో తొలి దళిత మహిళ ముఖ్యమంత్రిగా కుమారి మాయావతిని చేశాడు.
రాజకీయ పునర్నిర్మాణం లేకుండా ఎటువంటి సాంస్కృతిక పునర్నిర్మాణం సాధ్యంకాదన్న డా బీఆర్ అంబేత్కర్ సూత్రీకరణను మనస్సాక్షిగా విశ్వసించి ఆ ఆశయ సాధనకోసం జీవితకాలం వెచ్చించినవాడు కాన్షిరామ్. రాజకీయాధికారమనే ”మాస్టర్ కీ” సకల సమస్యలకు పరిష్కారమని భావించిన అంబేద్కర్ కలల సౌధం నిర్మించాలనుకున్నాడు కాన్షిరామ్. లక్ష్య సాధనలో సైంటిస్ట్ , సోషల్ సైంటిస్ట్ గా మారిపోయాడు..
రక్తపు బొట్టు నేలరాలకుండానే భారతదేశంలో బ్యాలెట్ పద్దతిలో రాజ్యాధికారం సాధించవచ్చని నిరూపించాడు. ”ఈ దేశానికీ కాబోయే పాలకులం, నోట్ల రాజ్యాన్ని చెరిపి ఓట్ల రాజ్యం స్థాపించడం మనకర్తవ్యం అనే స్పృహను కల్పించాడు.”ఆత్మగౌరవం, సమానత్వం, కుల రహిత సమాజం కొరకు పోరాటం నడిపాడు. ఒక్కడిగా మొదలై, 25 మందితో మొదటి సమావేశంతో కదిలి లక్నోలో 25 లక్షల మంది ప్రజలతో బహుజన మహా సభలు నడిపించాడు. రెండు పాదాలు- రెండు చక్రాల (కాళ్లు, సైకిల్ )తో భారతదేశమంతటా పర్యటించి, సామాజిక చైతన్య ఉద్యమం నడిపించాడు. సాంస్కృతిక ఉద్యమానికి తెరలేపారు.
సామాజిక విప్లవకారులైన గౌతమ బుద్ధుడు, మహాత్మాజ్యోతిరావు ఫూలే, సంత్ రవిదాస్, ఛత్రపతి సాహుమహారాజ్, డా బీఆర్ అంబేత్కర్, పెరియార్ రామస్వామి, నారాయణగు రు, సావిత్రీబాయి ఫూలే జీవిత చరిత్రలు, వారి త్యాగాలను గురించి ప్రజల మధ్య చర్చించే వారు. దేశానికీ కావల సింది వక్తలు కాదు సమీకరించేవారు కావాలని నొక్కి చెప్పేవారు.
దళిత బహుజనుల విముక్తికి పరిష్కారం రాజ్యాధికారమేనని నమ్మాడు.
లక్ష్య సాధనకు ఉద్యోగం ఆటంకంగా ఉందని భావించి సైంటిస్ట్ ఉద్యోగం వదిలేసాడు. కరపత్రాలు చేతబట్టుకుని పల్లెలవైపు నడిచాడు. కాన్షిరామ్ రాజకీయ పోరాటానికి ఢిల్లీ వేదికయ్యింది. కాన్షిరామ్ దృష్టి ఢిల్లీ పీఠం మీదనే ఉండేది. కాబట్టి సైకిల్ యాత్రలు ఎక్కడ నుంచి మొదలుపెట్టినప్పటికీ చేరుకునేది ఢిల్లీకే.ఉద్యమానికి అవసరమైన నిధులకోసం ఉద్యోగులను సమీకరించాడు. వారితో బామ్ సెప్‌ను 1978లో ప్రారంభించాడు.”నీవు జన్మించిన సమాజానికి బదులుగా కొంత ఇవ్వు” అనే నినాదంతో సుమారు 20 వేల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఉద్యోగులను సమీకరించాడు. చెప్పులుకుట్టేవారు మొదలుకొని ఉన్నతాధికారుల వరకు నెలజీతంలో నుంచి, రోజువారీ పనిలో నుండి కొంత దాచిపెట్టి ఇచ్చిన డబ్బును సమీకరించాడు. దళిత్ శోషిత సమాజ్ సంఘర్షణ సమితిని 1981లో ప్రారంభించి బహుజనులందరిని ఏకం చేసాడు. అంబేద్కర్ జయంతి రోజు ఏప్రిల్ 14 , 1984 లో బహుజన సమాజ్ పార్టీ అనే రాజకీయ పార్టీని రూపొందించి, బహుజనులకు రాజ్యాధికార దిశను కల్పించాడు.
బహుజన రాజ్యాధికారం అనే సమరంలో కార్యకర్తలు నిజాయితీ పరులుగా, ప్రజలకు విధేయులుగా ఉండాలని చెప్పేవారు. ఎప్పుడు కూడా ఎవరికి లొంగిపోకూడదని నొక్కి చెప్పేవారు.
విధేయత, లొంగిపోవడం వేరు వేరు అర్దాలు. విధేయత అనేది ప్రజలపట్ల నిబద్దత కాగా లొంగి ఉండటం బానిసత్వం అని అనేవారు. కాన్షిరామ్ మాటలతో పాటు ఆచరణకు ప్రాధాన్యతనిచ్చేవాడు.ఈ సమాజానికి కావలసింది త్యాగధనులు అని అనేవాడు. ప్యాంటు చొక్కా వేసుకునీ, విజ్జ్ఞానవంతులు పల్లెలకు వెళ్లి తమ సమాజమును ఏకం చేయాలనీ కాన్షిరామ్ ఆచరించి చూపించిన కాన్షిరామ్ అక్టోబర్ 9, 2006న గుండెపోటుతో న్యూఢిల్లీలో మరణించాడు.