సిరా న్యూస్,న్యూఢిల్లీ;
నిజ్జర్ హత్య కేసు వ్యవహారం భారత్- కెనడాల మధ్య ప్రకంపనలు రేపుతున్నాయి. ట్రూడో సర్కార్ రాజకీయ లబ్ది కోసం కయ్యానికి కాలు దువ్వినట్టే కనిపిస్తోంది.ట్రూడో సర్కార్ దుష్ట చేష్టలకు బదులుగా మోదీ సర్కార్ కూడా అదే రేంజ్‌లో రియాక్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను బహిష్కరించింది భారత్. మరో నాలుగు రోజుల్లో కెనడా దౌత్య వేత్తలు ఇండియా వదిలి పోవాలని ఆదేశించింది. దీంతో ఇరుదేశాల మధ్య నిజ్జర్ కేసు ముదిరిపాకాన పడింది.కెనడా ఓటు బ్యాంకు రాజకీయాలు మొదలుపెట్టేసిందా? నిజ్జర్ కేసులో భారత్‌ను దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందా? ఎందుకు ట్రూడో సర్కార్ అలా చేసింది? కేవలం రాజకీయ లబ్ది కోసమే ట్రూడో సర్కార్ ఈ విధంగా వ్యవహరిస్తోందా? ఖలిస్తానీలకు ట్రూడో సర్కార్ అండగా నిలుస్తోందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.సిక్కుల అతివాద నేత హర్దీప్‌సింగ్ నిజ్జర్ హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ఏకంగా భారత్ హైకమిషనర్ సంజయ్‌కుమార్ వర్మను చేర్చడానికి ప్రయత్నం చేసింది ట్రూడో సర్కార్. దీనిపై భారత్ ప్రభుత్వం తీవ్రంగా మండిపడింది.ఓటుబ్యాంకు రాజకీయాల కోసం జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని కెనడా ప్రభుత్వం భారత్‌ను దోషిగా చిత్రీకరించే ప్రయత్నాన్ని భారత్ తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో కెనడా డిప్యూటీ హైకమిషనర్‌తో సహా ఆరుగురు దౌత్యవేత్తలను దేశం విడిచి వెళ్లాల్సిందిగా భారత్ ఆదేశించింది. అక్టోబరు 19 అర్ధరాత్రి 12 గంటలలోపు భారతదేశం విడిచి వెళ్లాలన్నది అందులోని ప్రధాన పాయింట్.మరోవైపు కెనడాలో ఉన్న భారత దౌత్యవేత్తలు వెనక్కి రావాల్సిందిగా ఇప్పటికే ఆదేశించింది. 1988 ఐఎఫ్ఎస్ బ్యాచ్‌కు చెందిన సంజయ్‌కుమార్ వర్మ గడిచిన రెండేళ్ల నుంచి కెనడా భారత్ హైకమిషనర్‌గా పని చేస్తున్నారు. గడిచిన మూడున్నర దశాబ్దాలుగా ఆయన వివిధ దేశాల్లో దౌత్యవేత్తగా పని చేస్తున్నారు.భారత్-కెనడా మధ్య వ్యవహారం ఆరేళ్ల నుంచి నలుగుతూనే ఉంది. భారత్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునేలా ట్రూడో సర్కార్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ తర్వాత ట్రూడో మంత్రివర్గంలో కొందరు ఖలిస్తాన్ వేర్పాటు వాదులు మద్దతు పలికారు.ఈలోగా కెనడా పౌరుడైన నిజ్జర్ హత్య కేసు వెలుగులోకి వచ్చింది. ఇందులో భారత్ ఏజెంట్ల పాత్ర ఉందని ప్రపంచ దేశాలను నమ్మబలికే ప్రయత్నం చేసింది కెనడా. ఎలాంటి ఆధారాలు చూపించ లేకపోయింది. కేవలం ఆరోపణలకే పరిమితమైంది. నిజ్జర్ కేసులో కెనడాలో ఉన్న భారత్ హైకమిషనర్ పేరు చేర్చడానికి తీవ్ర ప్రయత్నాలు చేసింది.. చేస్తోంది కూడా. రానున్న రోజులు ఇరుదేశాల మధ్య ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.