సిరా న్యూస్,హనుమకొండ;
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని పెద్ద చెరువులో హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేప పిల్లలను ఒదిలారు. తరువాత అయన మాట్లాడుతూ గత కేసీఆర్ ప్రభుత్వం మత్స్యకారులకు అండగా నిలిచిందని గత ఏడాది ఇదే చెరువులో మూడు లక్షల 30 వేల చేప పిల్లలను పంపిణీ చేస్తే… నేడు ప్రజా పాలన అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 1,65000 చేపలను వదలడం ఏంటని ప్రశ్నించారు. మత్స్యకారులకు అన్యాయం చేస్తే ఊరుకోమని వారికి అండగా పోరాడతామని స్పష్టం చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వం నియోజకవర్గంలో 294 చెరువులకు 60 లక్షల చేప పిల్లలను పంపిణీ చేశామని,కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 26లక్షల చేప పిల్లలను పంపిణీ చేయడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హుజురాబాద్ నియోజకవర్గాన్ని దళిత బంధు కింద పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిందని గత ప్రభుత్వం నిధులు కేటాయించారని,ఈ ప్రభుత్వం మిగతా దళిత బంధు నిధులను అందించకుండా దళితులను తీవ్రంగా ఇబ్బందులు పెడుతుందని,వారికి వచ్చే నిధులు పూర్తిస్థాయిలో అందించే వరకు దళితుల పక్షాన పోరాడతానని అన్నారు.వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడికాపులు కాస్తున్నారని,ధాన్యాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకొని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని,వెంటనే ధాన్యం కొనుగోళ్ళు చేపట్టి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.మేము ప్రజల పక్షాన పోరాడితే మాపై దాడులు చేస్తారా పేగులు తీసి మెడలో వేసుకుంటారాకళ్ళుతీసిగోలీలాడతారా.CM రేవంత్ రెడ్డి మాట తీరు ఇదేనా. అని అన్నారు.