సిరా న్యూస్, గుడిహత్నూర్:
ఆధార్ సెంటర్ల వద్ద అవస్థలు
+ కానరాని కనీస వసతులు
+ గుడిహత్నూర్ సెంటర్ ను పరిశీలించిన సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు తిరుమల గౌడ్
+ వసతులు కల్పించాలని డిమాండ్
ప్రజా పాలన దరఖాస్తులకు ఆధార్ కార్డు తప్పనిసరి కావడంతో ప్రజలు ఆధార్ సెంటర్ ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఆధార్ లో మార్పుల కోసం జనాలు సెంటర్ల వద్ద క్యూ కడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలోని ఆధార్ కేంద్రాన్ని సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు తిరుమల గౌడ్ శనివారం సందర్శించారు. ఆధార్ సెంటర్ వద్ద ఉన్న మహిళలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… గత నెల రోజులుగా ఆధార్ సెంటర్ వద్ద విపరీతమైన రద్దీ ఉండడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నట్లు తెలిపారు. అనంతరం అధికారులతో మాట్లాడి, ఆధార్ సెంటర్ వద్ద కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. వీలైతే అదనంగా మరో ఆధార్ కేంద్రం ఏర్పాటు చేయాలనీ సూచించారు. అధికారులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజా పాలన గ్రామ సభలను నిర్వహించాలని అన్నారు. ఆయనతో పాటు పిఏసిఎస్ నాయకులు సంజయ్ ముండే, తదితరులు ఉన్నారు.