సిరా న్యూస్,న్యూఢిల్లీ;
ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా అనేక ప్రముఖ కంపెనీలు కూడా ఉద్యోగ నియామకాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. చిన్న కంపెనీలు అయితే ఖర్చులు తగ్గించుకుంటున్నాయి. ఉద్యోగా నియామకాలు నిలిపివేశాయి. ఉన్నవారిని కూడా తొలగిస్తున్నాయి. కంపెనీలకు ప్రోత్సాహం లేకపోవడంతో భారత్‌లోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో చదివిన విద్యార్థులకు కూడా ఉద్యోగాలు దొరకడం లేదు. విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదివిన విద్యార్థుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. తాజాగా బాంబే ఐఐటీలో చదివిన విద్యార్థులకు వార్షిక వేతనం రూ.4 లక్షలతో ఉద్యోగాలు ఇవ్వడం పరిస్థితికి అద్దం పడుతోంది. ప్రముఖ కళాశాలల్లో చదివినా ఎక్కువ వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదన్న భావన కనిపిస్తోంది. ఇప్పటికే కాగ్జిజెంట్ నెలకు రూ. 20 వేలతో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే దానిపై సంస్థ వివరణ కూడా ఇచ్చింది. కానీ, ప్రస్తుతం బాంబే ఐఐటీయన్లకు కూడా మంచి వేతనాలు రాకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది.బాంబే ఐఐటీలో చదివిన విద్యార్థులకు గతంలో కంపెనీలు రూ.కోటి వేతన ప్యాకేజీతో ఉద్యోగాలు ఇచ్చేవి. కానీ రూ.4 లక్షల అత్యల్ప ప్యాకేజీతో నియమించడం ఆర్థిక సంక్షోభానికి అద్దం పడుతోంది. అయినా విద్యార్థులు ఉద్యోగాల్లో చేరడం ప్రస్తుత జాబ్ మార్కెట్ పరిస్థితిని తెలియజేస్తుంది. ప్రపంచ సంస్థలతో చూసుకుంటే.. బారత్‌ల ఇప్పటికీ కొన్ని ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయి. జీతంతో సంబంధం లేకుండా, అందరికీ కాకపోయినా చాలా మందికి ఆఫర్లు వస్తున్నాయి. అయితే యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలలో పరిస్తితి దారుణంగా ఉంది. కొత్త ఉద్యోగాలు అటుంచి.. ఉన్న ఉద్యోగాలే ఉంటాయో ఊడతాయో తెలియని పరిస్థితి.వాస్తవానికి, ఐఐటీ బాంబే నుండి గ్రాడ్యుయేట్లందరికీ ప్లేస్మెంట్లు రాలేదు. అనేక బహుళజాతి మరియు భారతీయ కంపెనీలు ప్లేస్మెంట్ ఇంటర్వ్యూలకు వచ్చాయి, కానీ విద్యార్థులు జాగ్రత్తగా ఎంచుకున్నారు. కొందరు కోటి రూపాయల ప్యాకేజీతో ఉద్యోగాలు కూడా పొందారు. మొత్తం 364 కంపెనీలు ఆఫర్ చేశాయి. 1,650 మందికి ఉద్యోగాలు, 22 మంది విద్యార్థులకు కోట్లాది రూపాయల ప్యాకేజీలు వచ్చాయి. ఈ ప్యాకేజీలు ఎలా ఉన్నా, మునుపటి కంటే సంఖ్యలు తక్కువగా ఉన్నాయి. 2,414 మంది విద్యార్థుల్లో 1,979 మంది క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో పాల్గొనగా, 1,475 మంది ఆఫర్ లెటర్లు అందుకున్నారు. 78 మంది విద్యార్థులు విదేశాల్లో ఉద్యోగాలు సాధించారు. మిగిలిన వారు ఇప్పటికీ ఉపాధి లేకుండా ఉన్నారు.జాబ్ మార్కెట్ చూసి దేశంలోని ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు, ఐఐటి విద్యార్థులు సంవత్సరానికి రూ. 4 లక్షల ఆఫర్లను అంగీకరించవలసి వస్తే, తమ పరిస్థితి ఏంటని భయపడుతున్నారు. లక్షలాది రూపాయలు వెచ్చించి అమెరికాలో చదువుతున్న విద్యార్థులకు అన్నింటికంటే దయనీయమైన దుస్థితి. చాలా మంది ఉద్యోగాలు దొరక్క స్వదేశానికి వెళ్తున్నారు. రానున్న సంవత్సరాల్లో పరిస్థితి మరింత దిగజారుతుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.