రెండు కూటములకు అగ్ని పరీక్షే…

సిరా న్యూస్,ముంబై;
సీట్ల లెక్క తేలింది. ఆట మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల వేళ మహారాష్ట్ర రాజకీయం మరుగుతోంది. సీట్ల పంపకాలపై మహా వికాస్ అఘాడీ ఓ క్లారిటీకి రాగా, మహాయుతిలో దాదాపుగా ఒక సయోధ్య కుదిరింది. ప్రధాన పార్టీలు అభ్యర్థులను కూడా ప్రకటించేశాయి.మహారాష్ట్ర ఎన్నికల కోసం దేశమంతా ఎదురుచూస్తోంది. ఎన్డీయే కూటమిని భారీగా దెబ్బతీసిన లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఓవైపు.. హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ అధికారం మరోవైపు.. మరిప్పుడు మహారాష్ట్రలో ఏం జరగబోతోంది? ఎన్డీయే సర్కార్ సత్తా చాటుతుందా లేదా అనే అంచనాలు, ప్రశ్నలతో మహా రాజకీయం మహా సంగ్రామాన్ని తలపిస్తోంది. దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది.ఇక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై ఇండియా కూటమిలో సయోధ్య కుదిరింది. విపక్ష మహా వికాస్ అఘాడీ కూటమిలోని ప్రధాన పార్టీలైన శివసేన యూబీటీ, కాంగ్రెస్, ఎన్సీపీ, ఎస్పీ చెరో 85 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 270 సీట్ల విషయంలో ఏకాభిప్రాయం కుదిరింది. మిగతా 18 సీట్లను సమాజ్ వాదీ పార్టీ సహా మిగిలిన భాగస్వామ్య పక్షాలకు ఇచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయి. మహా వికాస్ అఘాడీ కూటమిలో ఎస్పీతో పాటు ఆప్, పీడబ్లుపీ, లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి.వెంటాడుతున్న లోక్ సభ ఫలితాలు ఒకవైపు.. మరాఠాల్లో వ్యతిరేకత మరోవైపు.. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీకి కత్తి మీద సాము లాంటి పరిస్థితులు ఉన్నాయి. మరిప్పుడు కమలం పార్టీ ఎలాంటి స్ట్రాటజీలు సిద్ధం చేయబోతోంది? బీజేపీ ముందున్న ఆప్షన్స్ ఏంటి? హర్యానా స్ట్రాటజీని ఇక్కడ వర్కౌట్ చేద్దాం అనుకుంటున్న కమలం పెద్దల ఆలోచన కరెక్టేనా?మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మరాఠాలు ఎటువైపు ఉంటారు అనేది కీలకంగా మారింది. రాష్ట్రంలో 33 శాతంగా ఉన్న మరాఠా జనాభా మద్దతు మహాయుతి, మహా వికాస్ అఘాడీ కూటములకు కీలకంగా మారింది. 288 అసెంబ్లీ నియోజకవర్గాలు కలిగిన మహారాష్ట్రలో దాదాపు 160 నియోజకవర్గాల్లో మరాఠాలు గెలుపోటములను ప్రభావం చేసే స్థాయిలో ఉన్నారు. రిజర్వేషన్ల కోసం 6 సార్లు దీక్షలు చేసిన మరాఠాలకు మనోజ్ జరాంజే పాటిల్ సరికొత్త నాయకుడిగా ఎదిగారు. దీంతో జరాంజే మద్దతు కోసం అభ్యర్థులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *