సిరా న్యూస్,రంగారెడ్డి;
చందానగర్ లో కుక్క తరమడంతో మూడవ అంతస్తు పై నుండి ప్రమాదవశాత్తు కింద పడి యువకుడు మృతి చెందాడు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వివి ప్రైడ్ హోటల్లో ఘటన జరిగింది. అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెనాలి కి చెందిన ఉదయ్ (23) కుటుంబ సభ్యులతో నగరానికి వచ్చి రామచంద్రపురం అశోక్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. ఆదివారం తన స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు చందానగర్ లోని వివి ప్రైడ్ హోటల్లో రూమ్ తీసుకున్నాడు. స్నేహితులతో కలిసి హోటల్లోని మూడవ అంతస్తు బాల్కనీలోకి వెళ్లగానే వారిని ఒక కుక్క తరిమింది. దీంతో భయాందోళనకు గురై వివి ప్రైడ్ హోటల్ మూడవ అంతస్తు బాల్కనీలోని కిటికీ నుండి ఉదయ్ కిందకు దూకాడు. తీవ్ర గాయాల పాలైన ఉదయ్ ను చికిత్స నిమిత్తం స్నేహితులు హాస్పిటల్ కు తరలించారు. అయితే, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు పోలీసులు తరలించారు. దృశ్యాలు సీసీటీవీ కెమెరాల లో రికార్డు అయ్యాయి. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకోగా సోమవారం రాత్రి వరకు బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. అసలు హోటల్ మూడవ అంతస్తులోకి కుక్క ఎలా వచ్చింది అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి….