సిరా న్యూస్,అదిలాబాద్;
ఆదివాసీలు పోరాటానికి వెనుకాడరు. అనుకుంటే సాధించే వరకు పోరాటం ఆపరు. ఐకమత్యానికి కేరాఫ్ అడ్రస్ ఆదివాసీలు. అందుకు నిదర్శనం ఇంద్రవెల్లి ఘటన. ఇప్పటీ ప్రభుత్వంతో అనేక విషయాల్లో ఆదివాసీలు పోరాటాలు చేస్తూనే ఉన్నారు.
ఐకమత్యం అంటే తరుచు ఆదివాసులే గుర్తుకు వస్తారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో.. వారు ఏదైనా అనుకుంటే నెరవేర్చుకునే వరకు పోరాటం ఆపరు, వారు వారి గ్రామ పెద్దల మాటలను తప్ప వేరే వారి మాటనే వినరు అని పేరు. ఆదివాసీలను ఒప్పించాలంటే చాలా చాలా కష్టతరం అని చెప్పుకుంటారు. ఒకసారి ఆదివాసీలు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు అంటే ఇక ఆ పని పూర్తయ్యే వరకు వారి పోరాటం ఆగదని అధికారులు, రాజకీయ నాయకులు చర్చలు చేస్తుంటారు. నిత్యం కొమురం భీమ్ పోరాట స్ఫూర్తిని నింపుకుంటూ కొనసాగుతారు ఈ ఆదివాసీలు.జల్, జంగల్, జమీన్ అనే నినాదంతో ఆదివాసులు తమ హక్కుల కోసం ఇంద్రవెల్లిలో శాంతియుతంగా సమావేశం జరుపుతుండగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆదివాసులు అమరులు కాగా, మరికొందరు రక్తపు మడుగులో ప్రాణాలను అరచేతిలో పట్టుకొని పుట్టకొకడు, గుట్టకొకడు వెళ్లి ప్రాణాలను రక్షించుకున్నారు. ఆ సంఘటనకు సరిగ్గా ఏప్రిల్ 20 నాటికి 43 ఏండ్లు అయ్యింది.ఏజెన్సీ పరిధిలోని ఇంద్రవెల్లిలో 1981 ఏప్రిల్ 20న అప్పటి రైతు కూలీ సంఘం, పోర్క దొరలు (ప్రస్తుత పీపుల్స్ వార్) ఆదివాసులు ఎదుర్కొంటున్న భూసమస్యలు, అటవీ అధికారుల వేధింపులు, పంటలకు గిట్టుబాటు ధర లేక దళారుల మోసాలు తదితర సమస్యల పరిష్కారానికి ఇంద్రవెల్లి సమీపంలోని హీరాపూర్ లో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఆ రోజున వారాంతపు సంత కావడంతో జిల్లా నలుమూలల నుంచి ఆదివాసులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఇది గమనించిన పోలీసులు సమావేశానికి అనుమతి లేదంటూ వచ్చే ప్రజలను లోపలికి వెళ్లకుండా ఆంక్షలు విధించారు. ఈ సందర్భంగా సమావేశానికి వెళ్లే ఓ ఆదివాసీ మహిళకు పోలీసులు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య మాట మంతి పెరగడంతో అది కాస్త తీవ్ర స్థాయికి చేరుకుంది. దీంతో కోపోద్రిక్తురాలైన ఆ మహిళ తన చేతిలో ఉన్న కొడవలితో ఆ కానిస్టేబుల్ పొట్టలోకి కొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే తన ప్రాణాన్ని వదలిపెట్టాడు.