సిరా న్యూస్,ఇచ్చోడ
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి : ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి కల్లెపల్లి గంగయ్య
* ఇచ్చోడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కార్మికుల నిరసన
* ఈనెల 10న మండల ఎడ్యుకేషన్ కార్యాలయం ముందు ధర్నా
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి కల్లెపల్లి గంగయ్య అన్నారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని, సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం (ఏఐటీయూసీ అనుబంధ) టోకెన్ సమ్మెలో భాగంగా సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన కార్మికుల పథకం యూనియన్ (ఏఐటీయూసీ) జిల్లా సహాయ కార్యదర్శి కల్లెపల్లి గంగయ్య మాట్లాడారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ప్రభుత్వమే కోడిగుడ్లు, కార్మికులకు సంవత్సరానికి రెండు జతల యూనిఫాం, నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం ఉద్యోగ భద్రత కల్పించాలని, మెనూ చార్జీలు పెంచాలని కోరారు. అలాగే ఈ నెల 10వ తారీఖున మండల ఎడ్యుకేషన్ కార్యాలయం ముందు నిర్వహించే ధర్నా కార్యక్రమానికి మధ్యాహ్న భోజన పథకం కార్మికులు అధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు అన్నెల నరసవ్వ, మచ్చ వెంకటేష్, మచ్చ సవిత, కొత్తూర్ సంజీవ్, మధు తదితరులు పాల్గొన్నారు.