-ప్రభుత్వాన్ని ప్రశ్నించిన యాదవ సంఘం నాయకులు
సిరా న్యూస్,మంథని;
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాదవులకు సదర్ పండుగ ఉత్సవాలు ప్రభుత్వ పరంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేయడం సంతోషకరమే కానీ పండుగ ఖర్చు ఎవరు భరిస్తారని అఖిలభారత యాదవ సంఘం మంథని డివిజన్ యూత్ అధ్యక్షులు కనవేణ శ్రీనివాస్ యాదవ్, యాదవ సంఘం మంథని మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పెగడ శ్రీనివాస్ యాదవ్ లు ప్రశ్నించారు. బుధవారం మంథని ప్రెస్ క్లబ్ లో అఖిలభారత యాదవ సంఘం మంథని డివిజన్ యూత్ అధ్యక్షులు కనవేణ శ్రీనివాస్ యాదవ్, యాదవ సంఘం మంథని మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పెగడ శ్రీనివాస్ యాదవ్ లు పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాదవులు పస్తులుండి పండుగ చేసుకోలేరు కదా అని ప్రభుత్వాన్ని అడిగారు. పండుగ చేసుకోవడానికి నిధులు మంజూరు చేయాలన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వస్తే యాదవులకు మరింత మేలు జరుగుతుందని భావించామని, ప్రభుత్వం నుండి అందే గొర్రెలను సైతం రద్దుచేసి మా డీడీలు మాకే ఇస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కెసిఆర్ ప్రభుత్వం 20 గొర్రెలను ఒక పొట్టేలు ఇచ్చారని నేడు ఉన్న ప్రజా ప్రభుత్వం 40 గొర్రెలు 2 రెండు పొట్టేలు ఇస్తారని ఆశపడ్డామన్నారు. యాదవుల ఆశలను నిరాశలు చేస్తూ తమ డీడీలు తమకే ఇస్తున్నామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. నేటికైనా ప్రజాప్రభుత్వం స్పందించి యాదవుల సమస్యలను పరిష్కరించాలని గొర్రెలను పంపిణీ చేస్తూ ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వ భూములను సైతం గొర్ల మందలు మేపేందుకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ పాత్రికేయుల సమావేశంలో యాదవ సంఘం ఉపాధ్యక్షులు వేముల లక్ష్మయ్య, నాయకులు కణవీణ కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.