సిరా న్యూస్,లక్నో;
ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని కొత్తగా నిర్మించిన విమానాశ్రయం పేరు మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అయోధ్య ధామ్‌గా నామకరణం చేశారు. అంతకంటే ముందు రోజు డిసెంబర్ 27న అయోధ్య రైల్వే స్టేషన్ పేరును అయోధ్య ధామ్ జంక్షన్‌గా మార్చారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.భారత ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 30వ తేదీన అయోధ్యలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయం, రైల్వే స్టేషన్‌ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకారం, అయోధ్యలోని అత్యాధునిక విమానాశ్రయం మొదటి దశను రూ. 1,450 కోట్ల కంటే ఎక్కువ వ్యయంతో అభివృద్ధి చేశారు. విమానాశ్రయ టెర్మినల్ భవనం 6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇది ఏటా సుమారు 10 లక్షల మంది ప్రయాణికులకు సేవలను అందించడానికి సిద్ధం అయ్యింది.అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ భవనం నిర్మాణం శ్రీరామ మందిర ఆలయ నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తుంది. అయోధ్య విమానాశ్రయం టెర్మినల్ భవనంలో ఇన్సులేటెడ్ రూఫింగ్ సిస్టమ్, LED లైటింగ్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ఫౌంటైన్‌లతో ల్యాండ్‌స్కేపింగ్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, మురుగునీటి శుద్ధి కర్మాగారం, సోలార్ పవర్ ప్లాంట్ వంటి వివిధ సౌకర్యాలు ఉన్నాయి.పునరాభివృద్ధి చెందిన అయోధ్య రైల్వే స్టేషన్ మొదటి దశను రూ.240 కోట్లకు పైగా వ్యయంతో అభివృద్ధి చేశారు. అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్ అని పిలువబడే మూడు అంతస్తుల ఆధునిక రైల్వే స్టేషన్‌లో లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుడ్ ప్లాజా, పూజ అవసరాల కోసం దుకాణాలు, క్లోక్ రూమ్, పిల్లల సంరక్షణ గది, వెయిటింగ్ హాల్ వంటి అన్ని ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి.ఇదిలావుంటే, అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటారు. జనవరి 22న రామమందిర ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇందులో పాల్గొంటారు. దీంతో పాటు పలువురు నేతలు, ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు