-తాకట్టు పెట్టి కోట్లు కొల్లగొడుతున్న కేటుగాళ్ళు
-సహకరిస్తున్న ప్రవేట్ బ్యాంక్ మేనేజర్లు
-ఆడిట్ లో బయట పడిన అసలు రంగు
-బయటకు పొక్కకుండా నోట్లతో నోటికి తాళం
-నౌకరి కాపాడుకునేందుకు తంటాలు
సిరా న్యూస్,మణుగూరు ;
సులువుగా కోట్లు సంపాదించాలనే శతకోటి ఆలోచనలలో ఆనంతకోటి ఉపాయాలు. టెక్నాలజీ పెరుగుతున్నా.. దానికి తగ్గట్టుగానే మెలకువలు తెలిసిన కొంతమంది దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దేందుకు పన్నాగానికి పునాదులు వేస్తున్నారు. పనిచేసే చోట ఇతరుల చేత మోసాలకు పాల్పడితే అడిగే వారు ఎవరూ.? అడిగితే ఇతరులపై నెట్టే ప్రయత్నాలు చేస్తూ దొరికిపోయే వారు మరికొందరూ.? ఇంటి దొంగను ఈశ్వరుడైన కనిపెట్టలేరు అన్న చందంగా కొంతమంది మోసాలకు ఆజ్యం పోస్తూ తిన్నంటి వాసాలు లెక్కపెడుతున్నారు. నకిలీ బంగారంతో కోట్లు సంపాదించాలనే ఆలోచనతో ఇత్తడి వస్తువులకు పుత్తడి పూత పూసిన నకిలీ వాటికి గోల్డ్ లోన్లు ఇస్తూ తిలా పాపం తలపిడికెడు అన్న చందంగా పుట్టగొడుగుల్లా పుట్టుకోస్తున్న ప్రవేట్ బ్యాంక్ మేనేజర్లు ఈ మోసాలకు పాల్పడుతున్నారు. ఏదైనా అత్యవసరం వచ్చినప్పుడు వీలైనంతా త్వరగా రుణం పొందాలంటే బంగారం కుదువ పెట్టడమే సరైన మార్గం. మనం తీసుకెళ్లిన బంగారంపై బ్యాంక్ అధికారులు, గోల్డ్ అప్రైజర్‌తో అన్నిపరీక్షలు నిర్వహించిన అనంతరం అసలైనదేనా? నకిలీదా? అని నిర్ధారించుకున్న తర్వాతే రుణం మంజూరు చేస్తారు. అలాంటిది ఎటువంటి పరీక్షలు నిర్వహించకుండా నకిలీ బంగారం (కడియాలు) పెట్టి వివిధ ప్రవేట్ బ్యాంకుల్లో రూ.3 కోట్లు కాజేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనను బయటకు పొక్కకుండా లో లోపల మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
నకిలీ గోల్డ్ స్కామ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లో ప్రత్యేకంగా గోల్డ్ లోన్లు ఇచ్చే ప్రవేట్ బ్యాంక్ లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. అలాంటి బ్యాంకుల్లో నకిలీ బంగారం (కడియాలు) స్కాం వెలుగులోకి వచ్చింది. మణుగూరు మండలానికి చెందిన వ్యక్తి మొత్తంగా నకిలీ బంగారం కడియాలు పెట్టి ఒక్కొక్క బ్యాంక్ లో కోటి చొప్పున మూడు బ్యాంక్ ల్లో మూడు కోట్లు గోల్డ్ లోన్ తీసుకున్నాడు. గోల్డ్ లోన్ తీసుకున్న వ్యక్తి సంవత్సరాలు గడుస్తున్నా వడ్డీ కట్టడం లేదు. వాటిని విడిపించుకునేందుకు రావడం లేదు. వాటిని రెన్యూవల్ కూడా చేయించడం లేదు. అనుమానం వచ్చి పై స్థాయి అధికారులు బ్యాంక్ ఆడిటింగ్‌లో భాగంగా తనీఖీలు నిర్వహించగా అసలు విషయం బయటపడింది. ఈ విషయం బయటకు పొక్కకుండా విశ్వప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన వారికి బయటకు చెప్పకుండా నోట్ల కట్టలతో నోరు నొక్కేసినట్లు సమాచారం.