సిరాన్యూస్, ఆదిలాబాద్
ఎన్ని కేసులు పెట్టినా తగ్గేదేలేదు: ఎమ్మెల్యే కేటీఆర్
* ఉద్యమాల పురిటిగడ్డ కొమరం భీమ్ స్ఫూర్తితో ముద్దుకు పోతాం
* జోగు రామన్న చేపట్టిన పోరుబాటనే ఇక ఉద్యమ బాట
పేదలకు నష్టం చేస్తున్న ప్రభుత్వ వైఖరిపై ప్రశ్నిస్తే కేసులుపెడుతున్నారని, ఎన్ని కేసులు పెట్టినా తగ్గేదేలేదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం చేయకుండా అసమర్ధ పాలన కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా కోసం అన్నదాతలకు అండగా తలపెట్టిన పోరుబాట కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని రాం లీలా మైదానంలో నిర్వహించిన పోరుబాట సభలో రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నేతలు తీవ్రంగా ఖండించారు. ముందుగా సభకు హాజరైన కేటీఆర్ కు పార్టీ శ్రేణులు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా నీరజనాలు అందుకున్న ఆయనకు ఘన స్వాగతాలు లభించాయి. వేదికపైకి వచ్చిన తర్వాత నేతలు శాలువలు, పూలమాలలు, జ్ఞాపికలతో సత్కరించి అభిమానాన్ని చాటారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి జోగురామన్న తన ప్రసంగంతో శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఆయన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్ధ పాలన పట్ల స్థానికంగా మాట్లాడే బాషలో సేటైర్లు వేసి ఆకట్టుకున్నారు. ఎన్ని కేసులు పెట్టినా తగ్గేదేలేదంటూ స్పష్టం చేశారు. రైతాంగానికి, సామాన్య ప్రజానికానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అండగా ఉంటామని స్పష్టం చేయడంతో సభికుల నుండి హర్ష ధ్వానాలు వినిపించాయి. అనంతరం కేటీఆర్ ప్రసంగించి ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అడుగడుగునా అశాంతి, అభద్రత నెలకొందని, డిచ్ పల్లిలో పోలీసు కుటుంబీకులు ధర్నాలు చేయడం పరిస్థితికి అద్దం పడుతుందన్నారు. ప్రజల కోసం ప్రశ్నిస్తున్న తమపై కేసులు పెడుతున్నారన్నారు. ఎన్ని రోజులు జైల్లో ఉండడానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. అధికారులు, పొలలీసు యంత్రాంగం న్యాయం కోసం పని చేయాలనీ, అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు. మితిమీరి ప్రవర్తించిన వారికి తాము అధికారంలోకి వచ్చాక మిత్తితో సహా చెల్లిస్తామని స్పష్టం చేశారు. పేదలకు నష్టం చేస్తున్న ప్రభుత్వ వైఖరిపై ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, పేదలని కూడా చూడకుండా కేసుల పేరిట బెదిరించడం ఎంతమేరకు సమంజసమని ప్రశ్నించారు. ఉద్యమాలు పురిటిగడ్డ లాంటి ఆదిలాబాద్ లో పోరుబాట కు శ్రీకారం పడిందని, ఇదే బాటలో నడుస్తూ రైతుల పక్షాన పోరాడతామని పేర్కొన్నారు. ముక్రా గ్రామస్తులు ప్రభుత్వం ఇచ్చిన హామీలపై రాహుల్ గాంధీ కి పోస్టు కార్డులను పంపి ప్రశ్నించారని, పోస్ట్ కార్డు ఉద్యమాన్ని గ్రామగ్రామాన చేపట్టాలని పిలుపునిచ్చారు. తెలంగన ఉద్యమ సమయంలో భోరజ్ చెక్ పోస్ట్ వద్ద నిర్వహించిన ధర్నా రోజులను కేటీఆర్ గుర్తుకు తెచ్చుకున్నారు. ప్రస్తుతం అదే స్పూర్తితో అసమర్ధ ప్రభుత్వంపై పోరాడతామని తెలపడంతో సభికులు చప్పట్లతో మారుమోగించారు. అదాని వంటి కార్పోరేట్లకు ప్రభుత్వ ఆస్తులను ధారాదత్తం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, కెసిఆర్ ఉంటె వారి ఆటలు సాగేవి కాదన్నారు. ఆదిలాబాద్ లో పండించే పత్తికి గుజరాత్ కంటే తక్కువ ధర చెల్లించడం భావ్యం కాదని, పత్తి ధరపై ఇక్కడి బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. భారత రాష్ట్ర సమితి… భారత రైతు సమితిగా పోరాటాలు చేస్తుందని, రైతులెవరూ అధైర్య పడే అవసరం లేదని భరోసా కల్పించారు. సభకు పెద్ద ఎత్తున హాజరైన రైతులు, ప్రజలను చూసి జిల్లా నాయకత్వం పనితీరు పట్ల ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వ విధానాలపై పోరాటానికి జిల్లా తోవ చూపిందని, అదే బాటలో నడుస్తామని పునరుద్ఘాటించారు.సమావేశంలో మాజీ మంత్రి జోగురామన్న, ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, అనిల్ జాదవ్, కోవ లక్ష్మి, సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దుర్గం చిన్నయ్య, మాజీ జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ లతో పట్టణ అధ్యక్షులు అజయ్, మైనార్టీ నాయకులు సజీతోద్దీన్, యూనిస్ అక్బాని, మహిళా నాయకులు చారులత, స్వరూప రాణి బుడగం మమత, ప్రేమల,పాటు ఉమ్మడి జిల్లా నేతలు, పలువురు రాష్ట నాయకులు పాల్గొన్నారు.