సిరా న్యూస్,నిర్మల్
రైతులకు అన్ని వసతులు కల్పించాలి: కలెక్టర్ అభిలాష అభినవ్
వరి ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోళ్లు కేంద్రాల ఏర్పాట్లకు చేపట్టవలసిన చర్యలు, కేంద్రాల నిర్వహణ తదితర అంశాలపై నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ (రెవెన్యూ)తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. త్వరలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, కేంద్రాలలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన ఏర్పాట్లను కల్పించాలని అన్నారు. ఈ వానాకాలం నుంచే ప్రభుత్వం సన్న రకం వరి ధాన్యంకు రూ.500 బోనస్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వ బోనస్ పై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. సన్న ,దొడ్డు రకాలకు ధాన్యం కేంద్రాలను వేరువేరుగా ఏర్పాటు చేయాలని, సన్న రకపు ధాన్యపు బస్తాలపై కొనుగోలు కేంద్రానికి సంబంధించి వివరాలను ముద్రించాలని సూచించారు. మిల్లింగ్ లో ఇబ్బందులు తలెత్తకుండా సన్న దొడ్డు రకం ధాన్యపు బస్తాలను వేరువేరు మిల్లులకు తరలించాలని ఆదేశించారు. కేంద్రాలలో ధాన్యం మద్దతు ధర నిర్వహకుల సమాచారం తదితర అంశాల పూర్తి వివరాలు రైతులకు తెలిసేలా ఫ్లెక్సీ బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు సరిపడినన్ని టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు .తాగునీరు టెంట్ రాత్రి వేళల్లో విద్యుత్ లైటింగ్ సదుపాయాలు కల్పించాలన్నారు .మిల్లర్లు మిల్లింగ్ ప్రక్రియలో అలసత్వం వహించకుండా త్వరితగతిన మిల్లింగ్ ను పూర్తి చేయాలన్నారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమనయంతో పనిచేయాలని సూచించారు.సమావేశంలో డిఎస్ఓ కిరణ్ కుమార్, డీఎం వేణుగోపాల్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్, డిఆర్డిఓ విజయలక్ష్మి, లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్ , అధికారులు , మిల్లర్లు, లారీ అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.