సిరాన్యూస్, ఆదిలాబాద్
ఖైదీలు మంచి వైపు అడుగులు వేయాలి : కలెక్టర్ రాజర్షి షా
జైళ్ల లోని ఖైదీలు పరివర్తన చెంది మంచి వైపు అడుగులు వేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా జైలులో ఏర్పాటు చేసిన ఖైదీల సంక్షేమ దినోత్సవంలో జిల్లా పాలనాధికారి రాజర్షి షా , జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ బి.సౌజన్య, అదనపు ఎస్పీ సురేందర్ లతో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించారు.ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ జైళ్ల లోని ఖైదీలు పరివర్తన చెంది మంచి వైపు అడుగులు వేయాలని, మనిషి పుట్టుకతో ఎలాంటి నేరాలు చేయరని ఆవేశాన్ని తగ్గించుకుని జీవించినప్పుడే సమాజంలో గౌరవంగా జీవించగలమన్నారు. జైళ్లలో ఉన్న వారందరు నేను ఖైదిని కాదు అనే ఆలోచన చేసి పూర్తిగా పరివర్తన చెంది బయట ప్రపంచానికి రావాలన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ అహింసతోనే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారన్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు. ఎలాంటి హింసాత్మకమైన సంఘటనలు లేకుండా స్వాతంత్య్రం తెచ్చారన్నారు. ఇక్కడ ఆన్ని రకాల సదుపాయాలు ఉన్నాయని, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం, మెనూ ప్రకారం ఆహారం అందించడం జరుగుతుందని తెలిపారు.ప్రతీ బుధవారం కౌన్సిలింగ్ జరుగుతుందని, సైకాలజిస్ట్ లను నియమించడం జరిగిందనీ ఆన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ గాంధీజీ ని స్ఫూర్తిగా తీసుకుని క్రమశిక్షణతో మెలగాలని, మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని ఆన్నారు.ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ క్రీడలు ఆటలలో ఇండోర్ (క్యారమ్స్, చదరంగం, స్నేక్ , ల్యాడర్, లూడో, తదితర ఆటల పోటీలలోగెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, జిల్లా వైద్యాధికారి, కృష్ణ, జిల్లా సుపరెండెంట్ అశోక్, తదితరులు పాల్గొన్నారు.