సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ సీపీఐ పార్టీలో నేతలది తలోదారి అయిపోయింది. సీపీఐ కేంద్ర కమిటీకి, తెలంగాణ కమిటీకి మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఇందుకు హరియానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమమే కారణమని అంటున్నారు. ప్రొఫెసర్ సాయిబాబా మరణం మీద సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఓ వీడియో విడుదల చేశారు.ఆయన మరణానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని, అందులో భాగమైన దత్తాత్రేయ నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరు కాబోమన్నారు నారాయణ. సాయిబాబా ఎజెండా విషయంలో పార్టీకి భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, ఆయన విషయంలో మాత్రం కచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని నారాయణ అభిప్రాయం వ్యక్తం చేశారు.ఇంత వరకు బాగానే ఉన్నా.. అది సీపీఐ స్టాండ్ అనుకుంటున్న సమయంలోనే ఈ అంశం కీలక మలుపు తీసుకుంది. దత్తాత్రేయ ఏర్పాటు చేసిన అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరుకాబోమని జాతీయ కార్యదర్శి నారాయణ చేసిన ప్రకటనతో సంబంధం లేకుండానే ఆ కార్యక్రమానికి హాజరయ్యారు సీపీఐ పార్టీ తెలంగాణ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు.ఇదే ఇప్పుడు సీపీఐ పార్టీలో కొత్త చర్చకు దారితీసింది. సీపీఐ రాష్ట్ర కమిటీ, కేంద్ర కమిటీలకు వేర్వేరు అభిప్రాయాలు ఉంటున్నాయా అన్న సందేహం మొదలైంది. ఒకే పార్టీలో ఢిల్లీ నాయకత్వం ఒకలాగా, తెలంగాణ నాయకత్వం మరోలా వ్యవహరిస్తున్నాయన్న చర్చ నడుస్తోంది. అసలు కామ్రేడ్స్ మధ్య భిన్నాభిప్రాయాలు, విరుద్ధమైన నిర్ణయాలకు కారణమేంటన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కూనంనేని సాంబశివరావు అలయ్ బలయ్‌కి వెళ్ళడంతో పాటు.. బండారు దత్తాత్రేయను ఆకాశానికి ఎత్తేయడంతో తెలంగాణ సీపీఐలో అసలేం జరుగుతోందన్న చర్చ మొదలైంది.బండారు దత్తాత్రేయ ప్రయత్నాన్ని సీపీఐ ఆహ్వానిస్తోందని కూనంనేని సాంబశివరావు చెప్పడంతోనే అసలు సమస్య మొదలైందని అంటున్నారు. దీంతో సీపీఐలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయా..లేదంటే సమన్వయ లోపామా..అన్న అనుమానాలు తలెత్తుతున్నాయట. అయితే ఈ వ్యవహారంలో నారాయణకు, రాష్ట్ర కార్యవర్గానికి మధ్య సమాచారం లోపం ఉన్నట్టు సీపీఐ నేతలు చెబుతున్నారు.ప్రొఫెసర్ సాయిబాబా విషయంలో సీపీఐ జాతీయ నాయకత్వం తరఫున నారాయణ తన అభిప్రాయాన్ని చెప్పారని, అక్కడే సమాచార లోపం ఉన్నట్టు చెబుతున్నాయి పార్టీ వర్గాలు. అయితే కారణం ఏదైనా బండారు దత్తాత్రేయ అలయ్ బలయ్ కార్యక్రమం మాత్రం కామ్రేడ్స్ మధ్య భేదాభిప్రాయాలకు కారణమైంది. ఇది కేవలం సమాచారం లోపమేనా లేదంటే సీపీఐ రాష్ట్ర, కేంద్ర కమిటీల్లోని నేతల మధ్యపైకి కనిపించని విభేదాలు ఇంకేమైనా ఉన్నాయా అన్న డౌన్స్ వ్యక్తం అవుతున్నాయి.