ఆధిపత్య పోరులో నేతలు
సిరా న్యూస్,నల్గోండ;
ఆయన మంత్రి.. ఈయనేమో అధికార పార్టీతో సన్నిహితంగా ఉండే విపక్ష నేత. ఈ ఇద్దరు ఒకప్పుడు మాటలను తూటాల్లా వాడుకున్నవాళ్లే ! అలాంటిది ఇప్పుడు ఇద్దరి మధ్య యుద్ధం మొదలైంది. అది అలాంటి ఇలాంటి వార్ కాదు.. ఆధిపత్య పోరు. వాళ్లే మంత్రి కోమటిరెడ్డి.. మండలి ఛైర్మన్ గుత్తా. ఇంతకీ ఇద్దరి మధ్య ఏం జరిగింది.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయ్. జంపింగ్ జపాంగ్‌లు పెరిగిపోయాయ్. అధికార కాంగ్రెస్‌లో చేరడమో.. అనుకూలంగా ఉండటమో చేస్తున్నారు నేతలు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ అయి మండలి చైర్మన్ గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి.. కాంగ్రెస్లో చేరకపోయినా.. కాంగ్రెస్‌కు అనుకూలంగా మారిపోయారు.ఆయన కుమారుడు అమిత్ రెడ్డి.. కాంగ్రెస్‌లో చేరి కార్పొరేషన్ చైర్మన్ అయిపోయారు. నల్లగొండ జిల్లా సీనియర్ నేత కావడంతో.. ఆయనకు మొదట్లో మంచి గౌరవం దక్కేది. దీంతో జిల్లాకు గుత్తా రెగ్యులర్‌గా ట్రిప్‌లు వేసేవారు. ఐతే కొంతకాలంగా పరిస్థితి మారింది. పెద్దాయన ట్రిప్‌లకు బ్రేక్‌లు పడుతున్నాయ్. మంత్రి కోమటిరెడ్డితో విభేదాలు మొదలయ్యాయనే చర్చ మొదలైంది. దీంతో నల్లగొండ పాలిటిక్స్‌లో ముసలం పుట్టింది.గుత్తా రెగ్యులర్‌గా నల్లగొండలో పర్యటనలు చేస్తుండడంతో.. కాంగ్రెస్ కార్యకర్తల్లో అభద్రతా భావం పెరిగింది. ఇక నల్గొండ వెళ్లిన ప్రతిసారి.. తన అనుచరులను చేరదీసుకొని.. వారికే ప్రయారిటీ ఇవ్వడం మొదలుపెట్టారు గుత్తా. పోలీస్‌స్టేషన్, తహశీల్దార్ ఆఫీసులకు ఫోన్ చేసి.. అనుచరుల పనులు చేయిస్తున్నారు. అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉండడంతో.. ఆయన ఎక్కువగా హైదరాబాద్‌కే పరిమితం అవుతున్నారు. దీంతో కార్యకర్తలకు అంతగా సమయం కేటాయించలేకపోతున్నారు.జిల్లాలో గుత్తా సుఖేందర్ రెడ్డి ద్వారా.. గతంలో బీఆర్ఎస్‌లో ఉన్న నేతలవే పనులు అవుతున్నాయ్. ఈ వ్యవహారం అంతా తీసుకెళ్లి మంత్రి దగ్గర పంచాయతీ పెట్టారు కార్యకర్తలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా.. తమ పనులు కావడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. గుత్తాకు ఫుల్‌స్టాప్ పెట్టాల్సిందేనంటూ మంత్రిని వేడుకున్నారట. దీంతో ఇంకేముంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి రంగంలోకి దిగారు.గుత్తాకు చెక్ పెట్టేందుకు.. తమ చేతికి మట్టి అంటకుండా.. జిల్లా ఎస్పీని మంత్రి కోమటిరెడ్డి రంగంలోకి దించారనే ప్రచారం జరుగుతోంది. గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్ కావడంతో.. ఆయన జిల్లాకు వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం ఎస్కార్ట్‌గా స్థానిక ఎస్ఐ, సీఐ వెళ్లడం కామన్. ఐతే జిల్లాలో పోలీస్ సిబ్బంది తక్కువగా ఉందని.. మంత్రితో సహా వీఐపీలు ఎవరు వచ్చినా పోలీస్ సిబ్బంది రావడం కుదరదంటూ.. నల్లగొండ జిల్లా ఎస్పీ ఒక లెటర్ విడుదల చేశారు.లేఖ విడుదల తర్వాత.. మండలి చైర్మన్ గుత్తాకు పోలీస్ ఎస్కార్ట్ ఆగిపోయింది. ఇక్కడితో ఆగారా అంటే.. గుత్తాకు మరో షాక్ తగిలింది. గుత్తా జిల్లాకు వస్తే.. ఆయన వాహనాలకు డీజిల్ కొట్టించడం కూడా ఆపేశారట. జిల్లాలో ఉన్న పెట్రోల్ బంకులకు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని.. పెట్రోల్, డీజిల్ పోయడం కుదరదని చెప్తున్నారట. జిల్లాకు మంత్రి కోమటిరెడ్డి వచ్చినా.. ఆయనే స్వయంగా డబ్బులు పెట్టి పెట్రోల్, డీజిల్ కొట్టించుకుంటున్నారని అధికారులు సమాధానం ఇస్తున్నారు.ఇలా కోమటిరెడ్డి వర్సెస్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యవహారంతో… నల్గొండ జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయ్. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి, చెక్ పెట్టేందుకు మంత్రి కోమటిరెడ్డి చేసిన ఈ ఎత్తు ఆసక్తికరంగా మారింది.