రైతులకు పంట నష్టం చెల్లిపులకు ప్లాన్

 సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండానే పంటల బీమా పథకాన్ని అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పంట బీమా పథకాన్ని రైతు యూనిట్‌గా అమలు చేసేందుకు వ్యవసాయశాఖ కసరత్తు చేస్తోందని, సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చాక పంటల బీమా పథకంపై ఒక నిర్ణయానికి వస్తామని, వీలైతే వచ్చే వానకాలం నుంచే అమలు చేస్తామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. అలాగే పంటల బీమా అమలులోకి వస్తే ప్రకృతి విపత్తులతో పంట నష్టం జరిగే రైతులకు ఆర్థికసాయం చేసేందుకు వీలుంటుందని, పంటల బీమాలో రైతులు కొంత ప్రీమియం భరిస్తే, ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో తన వాటాగా చెల్లించేందుకు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. 2016–17 రబీ నుంచి కేంద్రం ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకం ప్రారంభమైంది. 2019–20 వరకు ఈ పథకంలో తెలంగాణ రాష్ట్రంలో కొనసాగింది. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు దీనిని ఏర్పాటు చేశారు. ఇప్పుడు పంటల బీమాను అమలు చేసే కంపెనీలతో ఒప్పందం చేసుకుంటే ఆ ప్రకారం కంపెనీలు పంట నష్టం జరిగితే రైతులకు పరిహారం ఇవ్వాలని, దీంతో రైతులపై ఏమాత్రం ప్రీమియం భారం పడకుండా ప్రభుత్వమే అంతా చెల్లిస్తేనే ప్రయోజనం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అలాగే ఈ పథకం కంపెనీలనే బాగుపర్చుతుందన్న భావనతో రాష్ట్ర ప్రభుత్వం 2020లో ఫసల్‌ బీమా నుంచి తప్పుకుందని స్పష్టం చేశారు. అప్పటి నుంచి విపత్తులకు పంట నష్టపోయిన రైతులు ఆర్థిక సాయం అందే అవకాశమే లేకుండా పోయింది. ఇక 2020–21 వానాకాలం, యాసంగి సీజన్లు కలిపి 9 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. 2021–22లోనూ 12 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కానీ రైతులకు ఒక్కపైసా నష్టపరిహారం అందలేదు. ఈ క్రమంలో పంట బీమా లేకపోవడంతో రైతుల కష్టాలు పడుతున్నారు. ఈ రెండేళ్లలో 21లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లగా ఇంతవరకూ బీమా అమలు కాకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు.ఇక ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలలో వడగళ్లు, భారీ వర్షాల కారణంగా 10 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేశారు. చివరకు వ్యవసాయశాఖ 2.30 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లినట్టు తేల్చింది. ఎకరాకు ప్రభుత్వం రూ.10 వేల చొప్పున రైతులకు రూ. 230 కోట్లు పరిహారంగా ప్రకటించింది. ఇక డిసెంబర్ మొదటివారంలో రాష్ట్రంలో తుపాను కారణంగా వివిధ రకాల పంటలకు దాదాపు 5 లక్షల ఎకరాల్లో నష్టం జరిగింది. ఫసల్‌ బీమాకు ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో ప్రత్యేకంగా ఒక పంటల బీమా పథకం ప్రవేశపెడితే ఎలా ఉంటుందన్న దానిపై గత ప్రభుత్వ హయాంలోనే కసరత్తు జరిగింది. గ్రామం యూనిట్‌గా కాకుండా రైతు యూనిట్‌గా దీనిని ప్రవేశపెట్టాలని అనుకున్నారు. కానీ అమలుకు నోచుకోలేదు. ఇప్పటికే రెండు మూడు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలతో విసిగివేసారి బయటకు వచ్చి, సొంత పథకాలను రూపొందించుకున్నాయి. బెంగాల్‌ ప్రభుత్వం విజయవంతంగా సొంత పథకాన్ని అమలు చేస్తుంది. అక్కడ అధ్యయనం చేసి, ఆ ప్రకారం ముందుకు సాగాలని అధికారులు అనుకున్నప్పటికీ ఇంకా ఏదీ ముందుకుసాగకపోవడం రైతులకు ఆందోళన కలిగిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *