గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీపై డైలమా

సిరా న్యూస్,కరీంనగర్;
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి ఉద్యమ సమయంలో స్వామిగౌడ్ బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో గులాబీ పార్టీ అధికారికంగా పోటీ చేయలేదు. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వచ్చిన ఎన్నికల్లో కూడా పోటీ చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ ఎన్నికలకు పార్టీ నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఇంకా ఎటూ తేలడం లేదు. మాజీ సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ట్రబుల్ షూటర్ హరీష్ రావు, పార్టీ కీలక నేతలు మాజీ ఎంపీలు కల్వకుంట్ల కవిత, జోగినపల్లి సంతోశ్‌లు ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలోకే వస్తారు.గులాబీ పార్టీలో కీలక నేతలంతా ఈ ఎమ్మెల్సీ సెగ్మెంట్‌ పరిధి నుంచే ప్రాతినిధ్యం వహిస్తూ..ఎన్నికల్లో పోటీ చేయకపోతే ఎలా అని గులాబీ నేతల్లో చర్చ జరుగుతుందంట. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ వ్యతిరేకతతో పట్టభద్రుల మద్దతు ఉండదని పోటీ చేయలేదు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వ పనితీరుపై ఉద్యోగులు, పట్టభద్రులు అసంతృప్తితో ఉన్నారని గులాబీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అందుకే పోటీ చేస్తే కలసి వస్తుందని భావిస్తున్నారు.
ఎన్నికలు జరిగే నాటికి కాంగ్రెస్ సర్కార్‌ ఏర్పడి ఏడాది గడిచిపోతుందని.. అప్పుడు పరిస్థితులు మరింత అనుకూలంగా ఉంటాయని అంచనా వేసుకుంటున్నారు బీఆర్ఎస్ నేతలు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉండి ఎన్నికలకు దూరంగా ఉండటం సరికాదనే అభిప్రాయాన్ని పలువురు గులాబీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. గెలుపు ఓటములు ఎలా ఉన్నా..మండలి ఎన్నికల్లో పోటీ చేస్తే నాలుగు జిల్లాల్లో పర్యటిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే అవకాశం ఉంటుందంటున్నారు కొందరు నేతలు. రాజకీయంగా హైదరాబాద్ తర్వాత అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు ఈ పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో విజయం సాధించిన అంశాన్ని నేతలు గుర్తు చేస్తున్నారు.అయితే వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ బైపోల్ ఓటమి బీఆర్ఎస్‌ను ఆలోచనలో పడేసిందంటున్నారు. వరుసగా ఎన్నికల్లో ఓడిపోతూ వస్తే ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయోనన్న డైలమాలో ఉందట. అందుకే కరీంనగర్ గ్రాడ్యుయేట్ సీటులో పోటీపై ఎటూ తేల్చుకోలేకపోతుందట. పార్టీ అభ్యర్థిని అధికారికంగా ఖరారు చేసి సహకరిస్తే తప్ప పోటీ చేసేందుకు నేతలు ఆసక్తి చూపే అవకాశం లేనట్లు తెలుస్తోంది. పార్టీ అధినేత కేసీఆర్ దగ్గర ఈ అంశంపై కొద్ది రోజులుగా చర్చ జరుగుతున్నా గులాబీ దళపతి తన నిర్ణయాన్ని మాత్రం ఇంకా స్పష్టం చేయలేదని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *