ఉస్మానియా ఆస్పత్రిలో కరోనా కారణంగా ఇద్ద‌రు రోగులు మృతి

సిరా న్యూస్,హైద‌రాబాద్;
దేశ వ్యాప్తంగా కరోనా మ‌ళ్లీ అల‌జ‌డి సృష్టిస్తోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 116 కేసులు నమోదు కాగా ముగ్గురు మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 4,170 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొవిడ్ స‌బ్ వేరియంట్ జేఎన్.1 కేసులు 69కి చేరాయి.కాగా.. తెలంగాణలో సైతం కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. హైదరాబాద్‎లోని ఉస్మానియా ఆస్పత్రిలో కరోనా కారణంగా ఇద్ద‌రు రోగులు మృతి చెందారు. ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఉస్మానియా ఆస్ప‌త్రిలోని ఎమర్జెన్సీలో చేరిన వ్యక్తి చికిత్స పొందుతూ చనిపోయాడు. మ‌రో వ్య‌క్తి కూడా తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్ప‌త్రిలో చేరాడు. అత‌ను కూడా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. కాగా.. ఆ ఇద్ద‌రు రోగుల‌కు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. ఇద్ద‌రు రోగులు కూడా తీవ్ర అనారోగ్యంతో ఆస్ప‌త్రిలో చేరిన‌ట్లు ఆస్ప‌త్రి సుపరిండెంట్ నాగేంద్ర పేర్కొన్నారు.ప్రస్తుతం తెలంగాణలో 55, ఏపీలో 29 యాక్టివ్ కేసులు ఉన్నట్టు సమాచారం. కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో… దేశ వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ విధించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా.. ఉస్మానియా ఆసుపత్రిలో ఇద్దరు పీజీ డాక్టర్లు కూడా కరోనా బారిన పడినట్లు తేలింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *