దసరా పోయింది… దీపావళికైనా…

సిరా న్యూస్,నిజామాబాద్;
సార్‌ మంత్రి అవుదామనుకుంటున్నా. ఆగవయా నువ్వొకడివి. అసలే అధిష్టానం ఒప్పుకుంట లేదు. సార్‌ ఇప్పుడేమైంది. మంచిరోజులు లేవయా బాబు. సార్‌ దసరా వచ్చేసింది. మనం అధికారంలోకి వచ్చి కూడా ఏడాది కాబోతుంది. అమాత్య అదృష్టం ఎప్పుడు. అమాస అడ్డమొస్తుంది. దీపావళి అయిపోని అధిష్టానం ఒప్పుకుంటే అప్పుడు చూద్దాం. అవునా సార్‌.. ఇంకెన్నాళ్లు ఈ ఎదురుచూపులు. మేము ఈశ్వర్‌కి శపథ్ లేతాహు అని అనేదెప్పుడు అని నిరుత్సాహంలో ఉన్నారట ఆశావాహులు. అమాత్య పదవి రేసులో ఉన్నోళ్లు ఓవైపు డ్రీమ్స్‌లో.. మరోవైపు డైలమాలో ఉన్నారట.సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి వాళ్లలో ఆశలు చిగురిస్తుంటాయ్. ఆయన హస్తిన నుంచి వచ్చాక గుడ్‌ న్యూస్‌ ఏం లేదని తెలిసి.. సల్లబడిపోతారు. ఇట్ల ఐదారు సార్లు ఎదురుచూసి..ఎప్పుడైతే గప్పుడాయని..విస్తరణ జరిగితే మాత్రం బెర్త్‌ దక్కేలా ప్రయత్నాలు చేసుకుంటున్నారట. అయితే దసరా పండుగ మరోసారి ఆశావాహుల్లో ఆశలు రేపింది. కానీ ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ లేదన్న సంకేతాలు ఇచ్చిందట అధిష్టానం. దీంతో దీపావళి తర్వాతే క్యాబినెట్ ఎక్స్ పాన్షన్ ఉంటుందన్న చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతోంది. ఇంకేముంది అమాత్య బెర్తులు ఆశిస్తున్న వారంతా ఒక్కసారిగా నీరుగాపోయారని తెలుస్తోంది.మంత్రి వర్గ విస్తరణపై చాలామంది ఎమ్మెల్యేలు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఈసారి తమకు మంత్రి పదవి దక్కడం ఖాయమని తమ అనుచరులతో దీమాగా చెప్తున్నారట. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే తమకు అనుకూలంగా మీడియాలో పెద్ద ప్రచారం కూడా చేయించుకుంటున్నారట. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి..తమకు మంత్రి పదవి ఖాయమన్నట్లుగా ఫీలవుతున్నారట. సీఎం ఢిల్లీ టూర్‌ అప్డేట్స్‌పై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. మంత్రి వర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా అని సమాచారం తెలుసుకుంటున్నారట. ఇలా రేవంత్ ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న నేతల పరిస్థితి ఇలానే ఉంటోంది. సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లడం, ఎమ్మెల్యేలు ఎదురుచూసి సల్లబడిపోవడం కామన్‌ అయిపోయింది.మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతూ వస్తున్నా..ఎమ్మెల్యేలు తమ ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదన్న చర్చ జరుగుతోంది. అనుకూలంగా ఉన్న వర్గాల ద్వారా ఢిల్లీ పెద్దలతో రాయబారం నడుపుతున్నారట. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డితో టచ్ లో ఉంటూనే మరోవైపు ఢిల్లీ పెద్దలను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రివర్గంలో ఈ సారి ఎలాగైనా తమ పేరు ఉండాల్సిందేనని కొందరు సీనియర్లు పట్టుదలతో ఉన్నారట. అయితే ఈ మధ్య ఢిల్లీ వెళ్లిన రేవంత్‌రెడ్డికి.. దీపావళి తర్వాతే క్యాబినెట్ విస్తరణపై ఆలోచిస్తామని ఏఐసీసీ పెద్దలు సంకేతాలిచ్చినట్లు టాక్. ఈ విషయం తెలిసిన ఆశావాహులంతా నిరాశకు గురైనట్లు పార్టీవర్గాలు చర్చించుకుంటున్నాయి.అసలు మంత్రివర్గ విస్తరణ ఆలస్యం కావడానికి కారణాలు ఏమై ఉంటాయన్నది కాంగ్రెస్ నేతలెవ్వరికి అంతుపట్టడం లేదు. ఎందుకు కాంగ్రెస్ అధిష్టానం క్యాబినెట్‌ ఎక్స్‌పాన్షన్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం లేదని తలలు పట్టుకుంటున్నారట. మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే అధిష్టానం పెద్దలతో పలు మార్లు సంప్రదింపులు జరిపినా ఎందుకు పెండింగ్‌లో పెట్టారని ఆవేదన చెందుతున్నారట. ఇక ఇప్పుడు దీపావళి పండగ తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న సమాచారంతో మళ్లీ యథావిధిగా ఎవరి స్థాయిలో వాళ్లు మంత్రివర్గంలో చోటు కోసం లాబీయింగ్ మొదలుపెట్టారన్న టాక్ వినిపిస్తోంది.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పది నెలలు దాటిపోయింది. డిసెంబర్‌ వస్తే ఏడాది అవుతుంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటవుతుందనే మాట వినిపించినా అది కార్యరూపం దాల్చలేదు. మూడు నెలలుగా మంత్రివర్గ విస్తరణపై ఎన్నో ఊహాగానాలు కొనసాగుతున్నాయి. శ్రావణ మాసం అయిపోయింది. దసరా కూడా గడిచిపోయింది. ఇక దీపావళికి అయినా అమాత్య ఆశలు నెరవేరుతాయా లేదా అన్నది డౌట్‌గానే ఉందన్న చర్చ జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *